
రూ. లక్ష వరకు తగ్గనున్న ధర
మిడ్‌సైజ్ కార్ల ధరలూ దిగొస్తాయ్
పుంజుకోనున్న డిమాండ్
పండుగల సీజన్‌లో ఆటో రంగానికి జోష్
ఆధునిక ఫీచర్లు, టెక్నాలజీతో కూడిన ఎస్‌యూవీల ధాటికి చిన్న కార్లు చిన్నబోతున్న తరుణంలో.. జీఎస్‌టీ రేటు కోత తిరిగి ప్రారంభ స్థాయి కార్లకు డిమాండ్‌ను పెంచుతుందని ఆటోమొబైల్ పరిశ్రమలో ఆశాభావం వ్యక్తమవుతోంది. రోడ్లపై మళ్లీ చిన్న కార్లు తెగ సందడి చేయనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీఎస్‌టీలో 28 శాతం పన్ను రేటును 18 శాతానికి తీసుకొచి్చన నేపథ్యంలో ఒక్క చిన్న కార్ల ధర రూ.లక్ష వరకు తగ్గనుంది. దీంతో మరింత మంది వినియోగదారులకు ఇవి చేరువ కానున్నాయి.
2024–25 ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్ కార్ల మొత్తం విక్రయాల్లో చిన్న కార్ల వాటా 31 శాతంగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో 27 శాతానికి పడిపోయింది. ‘‘12 శాతం రేటు తగ్గిన ఫలితంగా కొనుగోలు వ్యయం రూ.లక్ష మేర తగ్గనుంది. దీంతో డిమాండ్ పుంజుకుంటుంది. పండగుల తరుణంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అమ్మకాలు పెరుగుతాయి. మధ్యశ్రేణి, విలాస కార్లపై జీఎస్‌టీ రేటు 40 శాతానికి పెరగనుంది. కాంపెన్సేషన్ సెస్ లేకపోవడంతో వీటి ధరలు కూడా తగ్గనున్నాయి’’అని గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ సాకేత్ మెహ్రా అంచనా వేశారు.
అందరికీ మేలు..: వాహనాలపై జీఎస్‌టీ రేటు తగ్గింపును భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర ఆహ్వానించారు. సకాలంలో తీసుకున్న ఈ చర్య ఆటోమోటివ్ రంగంలో తాజా ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ‘‘వాహనాల ధరలు చౌకగా మారతాయి. ముఖ్యంగా ఆరంభ స్థాయి కార్ల ధరలు తగ్గుతాయి. మొదటిసారి కొనుగోలుదారులకు, మధ్యాదాయ కుటుంబాలకు మేలు కలుగుతుంది’’అని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం రేటును కొనసాగించడాన్ని సైతం స్వాగతించారు. జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయాలు సాహసోపేతమైనవి, మార్పును తీసుకొచ్చేవిగా ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో వాహన ధరలు అందుబాటులోకి వస్తాయని, డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కీలకమైన పండుగల సీజన్‌లోకి అడుగుపెట్టిన తరుణంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా రేట్ల తగ్గింపు అమలు చేయడం ద్వారా ప్రయోజనాలను కస్టమర్లకు అందేలా చూడొచ్చన్నారు.
ప్రీమియం కార్లకూ ప్రయోజనమే..
పెద్ద కార్లపై లెవీలను క్రమబద్ధీ్దకరిస్తూ.. చిన్న కార్లపై రేటు తగ్గించడం సామాన్యులకు వాహనాలను చేరువ చేస్తాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ డీఎండీ స్వప్నేష్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి సెస్సు లేకుండా ప్రీమియం కార్లపై 40 శాతం జీఎస్‌టీ అమలు చేయడం వల్ల విక్రయాలు పెరుగుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సీఈవో హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
మరిన్ని వేగవంతమైన సంస్కరణల బాటలోకి చేరాం. ఇవి వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయి. ఎకానమీ విస్తృతమై, ప్రపంచవేదికపై భారత్ స్వరాన్ని బలపరుస్తుంది. ‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’ అన్న వివేకానంద సందేశాన్ని గుర్తు చేసుకోవాలి.
– ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్