మారుతీ లాభాలకు బ్రేకులు

Brakes for Maruti gains

క్యూ2లో రూ.2,484 కోట్లు

3 శాతం వృద్ధి; మొత్తం ఆదాయం రూ.21,438 కోట్లు

పూర్తి ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి అంచనా

ఎలక్ట్రికల్‌ వాహనాలనూ ప్రవేశపెడతామన్న కంపెనీ  

న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్లలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకి ఇండియా సెప్టెంబర్‌ త్రైమాసికంలో 2,484 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.2,401 కోట్లతో పోలిస్తే 3 శాతం వృద్ధి నమోదైంది. నిర్వహణేతర ఆదాయం తగ్గిపోవడంతో లాభంలో పెరుగుదల స్వల్పంగా ఉంది. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో 21.8 శాతం వృద్ధితో రూ.21,438 కోట్లుగా నమోదైంది.

గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.20,048 కోట్లుగా ఉంది. నికర లాభం 3.4 శాతం మాత్రమే పెరగడానికి నిర్వహణేతర ఆదాయం తగ్గిపోవడమే కారణమని మారుతి సుజుకి ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ మీడియాకు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు కూడా అధికంగా ఉన్నట్టు భార్గవ చెప్పారు. పన్ను రేట్లు పెరగడంతో పాటు ప్రకటనల వ్యయాలు, కమోడిటీల రూపంలో వ్యయాలు పెరగడం లాభాలపై ప్రభావం చూపించినట్టు వివరించారు.
 

జూలై–సెప్టెంబర్‌ విక్రయాలు
సెప్టెంబర్‌ క్వార్టర్లో మారుతి సుజుకి 4,92,118 వాహనాలు విక్రయించింది. ఇందులో విదేశీ మార్కెట్లలో విక్రయించినవి 34,717 వాహనాలు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17.6 శాతం అధికం. బాలెనో, విటారా, బ్రెజ్జా, డిజైర్‌ మోడళ్లకు మంచి డిమాండ్‌ ఉంటున్నట్టు భార్గవ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల అమ్మకాల వృద్ధిని నమోదు చేయగలమన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు.  

మార్కెట్‌ రారాజు
దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో సుమారు 50% వాటాతో మారుతి ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల కాలంలో అమ్మకాలు 17 శాతం వృద్ధి చెందాయి. మొత్తం 8,86,689 వాహనాలను కంపెనీ విక్రయించింది. దేశీయ మార్కెట్‌ పరంగా చూసుకుంటే అమ్ముడైన వాహనాల సంఖ్య 8,25,832.

ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లోనూ..
ఎలక్ట్రిక్‌ వాహనాలపై కంపెనీ ప్రణాళికల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘మేం ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తాం. అయితే దీనికి సంబంధించి కాలవ్యవధిపై ఇప్పుడే చెప్పలేం. కానీ, ఎలక్ట్రిక్‌ వాహనం అన్నది భారత్‌కు వస్తోంది. ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లోనూ మేం లీడర్‌గా కొనసాగాలనుకుంటున్నాం’’ అని భార్గవ తెలిపారు.

విద్యుత్‌తో నడిచే కార్లకు సంబంధించి తమ మాతృ సంస్థ సుజుకీ, టయోటాలు చర్చిస్తున్నట్టు చెప్పారు. మాతృ సంస్థ నుంచి టెక్నాలజీని అందుకుంటామన్నారు. సాధారణ కంబస్టన్‌ ఇంజన్‌ వాహనాలను భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రికల్‌ వాహనాలుగా మార్చే విధంగా హైబ్రిడ్‌ టెక్నాలజీపై ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top