బుక్‌–మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ

BookMyShow stake sale at 1 billion dollers valuation - Sakshi

కంపెనీ విలువ వంద కోట్ల డాలర్లపైనే!!  

ముంబై: ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ బుక్‌–మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్‌–మైషోలో 10–12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం జనరల్‌ అట్లాంటిక్, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ టెమసెక్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు సంబంధించిన చర్చలన్నీ తుది దశకు చేరాయని, మరికొన్ని వారాల్లో ఖరారవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సంస్థల డీల్స్‌ ఖరారైతే, బుక్‌–మైషో విలువ వంద కోట్ల డాలర్లను (రూ.7,000 కోట్లు) దాటుతుందని అంచనా. గత ఏడాది జూలైలో బుక్‌మైషో సంస్థ టీపీజీ గ్రోత్‌ నుంచి 10 కోట్ల డాలర్లు సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 80 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. తాజా డీల్స్‌లో భాగంగా సైఫ్‌ పార్ట్‌నర్స్‌ తన మొత్తం 5.6 శాతం వాటాను విక్రయిస్తుందని, యాక్సెల్‌ ఇండియా తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2016 వరకూ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సెగ్మెంట్లో బుక్‌–మైషో సంస్థదే గుత్తాధిపత్యం. ఆ తర్వాత పేటీఎమ్‌ రంగంలోకి రావడంతో బుక్‌–మైషో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. పేటీఎమ్‌లో కూడా భారీగా పెట్టుబడులుండటంతో బుక్‌–మైషో నుంచి వైదొలగాలని సైఫ్‌ పార్ట్‌నర్స్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

నెలకు 2 కోట్ల టికెట్లు...
1999లో బిగ్‌ట్రీ ఎంటర్‌టైన్మెంట్‌ పేరుతో బుక్‌–మైషో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆరంభంలో థియేటర్లలో సీట్ల మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలు చూసిన సంస్థ, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్లను అమ్మడం మొదలెట్టింది. ప్రస్తుతం నెలకు 2 కోట్ల వరకూ టికెట్లను అమ్ముతోంది. సినిమా టికెట్లనే కాకుండా సంగీత కచేరీలు, స్టాండ్‌–అప్‌ కామెడీ షోలు, స్పోర్ట్స్‌ ఈవెంట్లు తదితర కార్యక్రమాల టికెట్లను కూడా బుక్‌–మైషో విక్రయిస్తోంది. ఈ సంస్థ మొత్తం ఆదాయంలో ఈ సెగ్మెంట్‌ వాటా దాదాపు మూడోవంతు ఉంటుందని అంచనా. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.391 కోట్లకు పెరగ్గా, నికర నష్టాలు 17 శాతం పెరిగి రూ.162 కోట్లకు చేరాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top