
ముంబై : బ్యాంకింగ్ రంగంలోనూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ముందటి ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ లైంగిక వేధింపుల ఘటనలు బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్నట్టు తాజా డేటాలో వెల్లడైంది. బొంబై స్టాక్ ఎక్స్చేంజస్(బీఎస్‌ఈ)ల్లో లిస్టు అయిన 25 బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరం 210 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2015-16తో పోలిస్తే ఇది 5 శాతం అధికం. కాంప్లికారో సర్వీసెస్ ఈ డేటాను విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసుల్లో ఐసీఐసీఐ బ్యాంకు తొలి స్థానంలో ఉంది. ఈ బ్యాంకుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. యాక్సిస్ బ్యాంకులో 32 కేసులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 16 కేసులు నమోదైనట్టు ఈ డేటాలో వెల్లడైంది. ఈ కేసులను డీల్ చేయడానికి ఆర్గనైజేషన్లలో పారదర్శకత, ఉద్యోగుల మధ్య మంచి అవగాహన తీసుకురావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలు లేకుండా సౌకర్యవంతంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక బలమైన వ్యవస్థను బ్యాంకులు రూపొందించాలని ఈ రిపోర్టు సూచిస్తోంది. చాలా కంపెనీలు వేధింపులు, తప్పుడు ప్రవర్తన వంటి వాటికోసం జీరో-టోలరెన్స్ పాలసీని ప్రవేశపెట్టాయని నిపుణులు చెప్పారు. అయితే ఎక్కువ మొత్తంలో లైంగిక వేధింపులు ఫిర్యాదులు వెల్లువెత్తడం, అవన్నీ నిజం కావాల్సినవసరం కూడా లేదని కాంప్లికారో వ్యవస్థాపకులు విశాల్ కేడియా అన్నారు. పబ్లిక్ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. 9 పీఎస్‌యూ బ్యాంకుల్లో 2016-17లో 47 కేసులు నమోదయ్యాయి. ఆ ముందటి సంవత్సరం ఇవి 50గా ఉన్నాయి. కానీ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం 150 కేసుల నుంచి 163 కేసులకు పెరిగాయి.