వీడియోకాన్‌ బీమా వ్యాపారం విక్రయం

Bankrupt Videocon Group sells general insurance arm to DP - Sakshi

డీపీ జిందాల్‌ గ్రూప్‌కు 26 శాతం

ఈనామ్‌ సెక్యూరిటీస్‌కు 25% వాటా

ముంబై: దివాళా కేసు ఎదుర్కొంటున్న వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ సాధారణ బీమా వ్యాపారం జాయింట్‌వెంచర్‌లో తన పూర్తి వాటాను  విక్రయించింది. లిబర్టీ వీడియోకాన్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో తమ పూర్తి వాటాను డీపీ జిందాల్‌గ్రూప్‌కు, ఈనామ్‌ సెక్యూరిటీస్‌కు విక్రయించామని వీడియోకాన్‌ వెల్లడించింది.

అయితే ఈ లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను వీడియెకాన్‌ వెల్లడించలేదు. వీడియోకాన్‌ వాటా విక్రయానంతరం. ఈ బీమా కంపెనీలో డీపీ జిందాల్‌ గ్రూప్‌కు 26%, ఈనామ్‌ సెక్యూరిటీస్‌కు 25 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. విదేశీ భాగస్వామి అమెరికాకు చెందిన లిబర్టీ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌ గ్రూప్‌కు 49% వాటా ఉంటుంది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ కంపెనీ తన వాటాను 26% నుంచి 49%కి పెంచుకున్నది.

వీడియోకాన్‌ వాటా విక్రయానంతరం లిబర్టీ వీడియోకాన్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పేరు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీగా మారుతుందని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, పూర్తి కాలపు డైరెక్టర్‌ రూపమ్‌ ఆస్థానా తెలిపారు. కాగా కొత్త భాగస్వాముల చేరికతో తమ వ్యాపారాన్ని మరి ంతగా విస్తరిస్తామని, మరింతగా పటిష్టం చేస్తామని  బోస్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లిబర్టీ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది. సాధారణ బీమా రంగంలో మంచి నాణ్యత గల బీమా పాలసీలను, సర్వీసులను అందిస్తామని తెలిపింది.

మూడు కొత్త సెగ్మంట్లలో కొత్త పాలసీలు  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల కొత్త వ్యాపార ప్రీమియమ్‌ను ఆశిస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరం కొత్త వ్యాపార ప్రీమియమ్‌ కంటే ఇది 60 శాతం అధికమని  కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, పూర్తి కాలపు డైరెక్టర్‌ రూపమ్‌ ఆస్థానా తెలిపారు.

సాధారణ బీమా పరిశ్రమ 17 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తోందని, దీనికంటే రెండు–మూడు రెట్ల వృద్ధిని సాధించడం లక్ష్యమని వివరించారు. మూడు కొత్త సెగ్మెంట్లు–విలీనాలు, కొనుగోళ్లు, సైబర్, టైటిల్‌ లోకి ప్రవేశించాలనుకుంటున్నామని వివరించారు. 2913లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం 23 రాష్ట్రాల్లో 58 నగరాల్లో 60 కార్యాలయాలు, 1,100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top