రెట్టింపైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం | Sakshi
Sakshi News home page

రెట్టింపైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం

Published Sat, Jul 28 2018 1:07 AM

Bank of Baroda Net Profit Up Over Two-Times at Rs 528cr - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జూన్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన పనితీరు ప్రదర్శించింది. ఎన్‌పీఏలకు కేటాయింపులు తగ్గడంతో బ్యాంకు నికర లాభం రెట్టింపై రూ.528 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.3,102 కోట్ల మేర నష్టాలను ప్రకటించిన విషయం గమనార్హం. క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో పోలిస్తే బ్యాంకు లాభం రెట్టింపునకు పైగా పెరిగింది. జూన్‌ క్వార్టర్లో మొత్తం ఆదాయం స్వల్ప పెరుగుదలతో రూ.12,787 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 29 శాతం, క్రితం త్రైమాసికంతో పోలిస్తే 9.47 శాతం మేర పెరిగి రూ.4,381 కోట్లుగా ఉంది. దేశీయ నికర వడ్డీ ఆదాయ మార్జిన్‌ 2.93 శాతంగా, అంతర్జాతీయ కార్యకలాపాలపై వడ్డీ మార్జిన్‌ 2.65 శాతంగా ఉన్నాయి. ప్రధాన సేవల ఫీజు ఆదాయం కూడా 17 శాతం పెరిగి రూ.794 కోట్లుగా నమోదైంది.   

ఆస్తుల నాణ్యత: జూన్‌ క్వార్టర్లో బ్యాంకు మొండి బకాయిలు చెప్పుకోతగ్గ స్థాయిలోనే పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.40 శాతం నుంచి 12.46 శాతానికి చేరాయి. విలువ పరంగా రూ.55,874 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఏడాది మార్చి క్వార్టర్లో ఉన్న రూ.56,480 కోట్లతో చూస్తే మాత్రం స్వల్పంగా తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 5.17 శాతం నుంచి 5.40 శాతానికి (రూ.22,384 కోట్లు) పెరిగాయి. ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.1,760 కోట్లకు తగ్గాయి. ముఖ్యంగా ఐబీసీ కింద 26 ఎన్‌పీఏ ఖాతాలకు రూ.522 కోట్లను పక్కన పెట్టింది. ప్రొవిజన్స్, కంటింజెన్సీలు మొత్తం కలిపి రూ.2,477 కోట్లుగా ఉన్నాయి. జూన్‌ క్వార్టర్లో తాజాగా ఎన్‌పీఏలుగా మారిన రుణాల మత్తం రూ.2,868 కోట్లు. ఇదే కాలంలో రూ.2,579 కోట్ల మేర బకాయిలను వసూలు చేసుకుంది. రూ.546 కోట్ల విలువైన రుణాలను అప్‌గ్రేడ్‌ చేసింది. సంకేతాలన్నీ చూస్తే జూన్‌ క్వార్టర్‌ తమకు లాభదాయకమైనదని, దీన్ని నిర్థారించుకునేందుకు మరో క్వార్టర్‌ వేచి చూస్తామని బ్యాంకు చీఫ్‌ పీఎస్‌ జయకుమార్‌ తెలిపారు.  

Advertisement
Advertisement