జూన్‌కల్లా 50% డిమాండ్‌: బజాజ్‌ ఆటో

Bajaj Auto sees 50% demand in June - Sakshi

4 శాతం పెరిగిన షేరు

గ్రీన్‌జోన్లలో 50-60 శాతం డీలర్‌షిప్స్‌

ప్రస్తుతం 20-25 శాతం డిమాండ్‌

దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం వాహనాలకు 20-25 శాతం డిమాండ్‌ కనిపిస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం బజాజ్‌ ఆటో తాజాగా పేర్కొంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే వచ్చే నెలకల్లా డిమాండ్‌ 50 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. 50-60 శాతం డీలర్‌షిప్స్‌ గ్రీన్‌జోన్లలోనే ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఇక్కడ 50-60 శాతం వాహన విక్రయాలకు వీలున్నట్లు తెలియజేసింది. ఇక సర్వీస్‌ ఆదాయం సైతం సాధారణ పరిస్థితులతో పోలిస్తే 60-70 శాతంగా నమోదవుతున్నట్లు వివరించింది. అయితే సమీప భవిష్యత్‌లో దేశ, విదేశీ మార్కెట్లలో ఆటో రంగానికి పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నట్లు కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అభిప్రాయపడింది. ఈ అనిశ్చితుల్లోనూ బజాజ్‌ ఆటో మార్జిన్లను నిలుపుకోగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. ఆటో రంగంలో 2022లో మాత్రమే పూర్తిస్థాయిలో డిమాండ్‌ నెలకొనే వీలున్నట్లు అంచనా వేసింది. కాగా.. బజాజ్‌ ఆటో షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తూ రూ. 3,000 టార్గెట్‌ ధరను కొటక్‌ ఈక్విటీస్‌ ప్రకటించింది.

లాభం రూ. 1310 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో బజాజ్‌ ఆటో నామమాత్ర వృద్ధితో రూ. 1310 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే అమ్మకాలు 8 శాతం క్షీణించి రూ. 6816 కోట్లకు పరిమితమయ్యాయి. రిటైల్‌ ఫైనాన్సింగ్‌ అందుబాటు కారణంగా ద్విచక్ర వాహన విక్రయ విభాగం పటిష్ట పనితీరు చూపుతున్నప్పటికీ త్రిచక్ర వాహన అమ్మకాలు నీరసిస్తున్నట్లు బజాజ్‌ ఆటో పేర్కొంది. ఈ నేపథ్యంలో బజాజ్‌ ఆటో కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం బజాజ్‌ ఆటో షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 2661 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2724ను అధిగమించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top