ఏపీ, తెలంగాణ నుంచి రెండు రిటైల్‌ చైన్లు ఔట్‌ | AP,Telangana out of both retail chains | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణ నుంచి రెండు రిటైల్‌ చైన్లు ఔట్‌

Jul 26 2018 1:25 AM | Updated on Aug 18 2018 6:00 PM

AP,Telangana out of  both retail chains  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ విక్రయంలో ఉన్న రిటైల్‌ చైన్లు యూనివర్‌సెల్, హాట్‌స్పాట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ నుంచి తప్పుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యూనివర్‌సెల్‌కు చెందిన 26 ఔట్‌లెట్లను సెలెక్ట్‌ మొబైల్స్‌ చేజిక్కించుకుంది. దేశవ్యాప్తంగా యూనివర్‌సెల్‌ చేతిలో 200 ఔట్‌లెట్లున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు సతీష్‌బాబు నుంచి ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ గతేడాది యూనివర్‌సెల్‌ను చేజిక్కించుకుంది. ఒకానొక స్థాయిలో 450 స్టోర్లతో ఈ సంస్థ మొబైల్స్‌ రిటైల్‌ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది. ఈఎంఐ ద్వారా ఫోన్ల అమ్మకం, బ్రాండ్‌ అంబాసిడర్‌ నియామకం, లైవ్‌ డెమో ఏర్పాటును భారత్‌లో తొలిసారిగా యూనివర్‌సెల్‌ చేపట్టింది. మిగిలిన ఔట్‌లెట్ల కొనుగోలుకు ఆ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని సెలెక్ట్‌ ఫౌండర్‌ వై.గురు ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. నాన్‌ డిస్‌క్లోజర్‌ ఒప్పందం వల్ల డీల్‌ విలువ చెప్పలేమన్నారు. యూనివర్‌సెల్‌ డీల్‌తో ఆగస్టు చివరికల్లా సెలెక్ట్‌ స్టోర్ల సంఖ్య 50కి చేరుతుందని తెలియజేశారు. తాజా డీల్‌తో ఇక్కడి యూనివర్‌సెల్‌ స్టోర్లు  సెలెక్ట్‌గా మారతాయి. 

వేగంగా హ్యాపీ విస్తరణ..: ఇటీవలే రంగ ప్రవేశం చేసిన హ్యాపీ మొబైల్స్‌ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని హాట్‌స్పాట్‌ ఔట్‌లెట్లను దక్కించుకుంది. హాట్‌స్పాట్‌కు ఈ రెండు రాష్ట్రాల్లో 15 కేంద్రాలున్నాయి. ఇక  ఇవి హ్యాపీ స్టోర్లుగా మారనున్నాయి. హ్యాపీ ప్రస్తుతం 28 సెంటర్లను నిర్వహిస్తోంది. ఆగస్టులో వీటికి 8 తోడవనున్నాయి. సెప్టెంబరుకల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 50కి చేరుతుందని హ్యాపీ సీఎండీ కృష్ణపవన్‌ వెల్లడించారు. తాజా డీల్‌తో దక్షిణాది రాష్ట్రాల నుంచి హాట్‌స్పాట్‌ తప్పుకున్నట్టయింది. ప్రస్తుతం ఇది ఢిల్లీకే పరిమితమైనట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement