ఈ-కామర్స్‌ కంపెనీలపై స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాలు ఫిర్యాదు

Apple, Nokia, Vivo And Others Complain Against Flipkart, Amazon - Sakshi

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాలు ఆపిల్‌, నోకియా, వివో వంటి కంపెనీలు ఫిర్యాదు చేశాయి. మొబైల్‌ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఈ-​కామర్స్‌ కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఈ హ్యాండ్‌సెట్‌ తయారీదారుల లాబీ ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌(ఐసీఏ), వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభుకు ఫిర్యాదు చేసింది. విదేశీ మూలధనాన్ని భారీ డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడానికి వాడుతున్నాయని ఐసీఏ ఆరోపిస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీఏ కోరుతోంది.

ఇన్వెస్టరీని పెట్టుకుని, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తూ.. ఎఫ్‌డీఐలోని ప్రెస్‌ నోట్‌ 3 కిందనున్న నిబంధనను కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఐసీఏ పేర్కొంటోంది. దీంతో ఆఫ్‌లైన్‌ రిటైలర్ల రెవెన్యూలు హరించుకుపోతున్నాయని, దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐసీఏ తెలిపింది. ఈ పరిస్థితిపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొబైల్‌ ఫోన్లు, ఇతర ఉత్పత్తుల ధరలను ఇవి ప్రభావితం చేస్తున్నాయని సురేష్‌ ప్రభుకు తెలియజేసింది. ప్రెస్‌ నోట్‌ 3 నిబంధనలను, ఇతర చట్టాలను ఉల్లంఘించే వారిపై మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోరుతోంది.  ఈ కంపెనీలను దేశానికి వ్యతిరేకంగా ఎకనామిక్‌ టెర్రరిజం చేపడుతున్నాయని భావించాలని పేర్కొంది. 

అయితే ఈ ఆరోపణలను అమెజాన్‌ కొట్టిపారేసింది. తాము దేశీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని అమెజాన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. విక్రయదారులు నిర్ణయించిన ధరలను అమెజాన్‌.ఇన్‌ మార్కెట్‌ప్లేస్‌లో ఆఫర్‌ చేస్తున్నాని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం దీనిపై  స్పందించలేదు. ఐసీఏ, హ్యాండ్‌సెట్‌ తయారీదారులు ఆపిల్‌, మైక్రోమ్యాక్స్‌, నోకియా, వివో, లావా, మోటోరోలా, లెనోవా వంటి కంపెనీల లాబీ సంస్థ. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top