మా ఫోకస్‌ రూ.5–10 లక్షల కార్లపైనే

Another six new cars in five years  - Sakshi

అయిదేళ్లలో మరో ఆరు కొత్త కార్లు

ఫోక్స్‌వ్యాగన్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ నాప్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ వచ్చే అయిదేళ్లలో భారత మార్కెట్లో ఆరు కొత్త కార్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో మూడు స్కోడా బ్రాండ్‌లో రానున్నాయి. వర్చూస్‌ సెడాన్, టి–రాక్‌ ఎస్‌యూవీ అడుగుపెట్టే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల రాకతో కొన్ని పాత మోడళ్లకు స్వస్తి పలుకుతామని ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ నాప్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.

‘2022 నాటికి 3 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యంగా చేసుకున్నాం. ఆ సమయానికి కంపెనీ వార్షిక అమ్మకాలు 1,20,000–1,30,000 యూనిట్లకు చేరుతుందని అంచనా. 32 లక్షల యూనిట్ల భారత కార్ల పరిశ్రమలో ప్రస్తుతం కంపెనీకి 1.50% వాటా ఉంది. పాత కార్ల విక్రయాల్లోకి అడుగు పెడతాం. స్కోడాతో కలిసి తయారీని విస్తరించనున్నాం. భారత్‌లో పోటీ ధరలో ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెడతాం’ అని వివరించారు.  

ఆ విభాగంలోనే మోడళ్లు..: ప్రస్తుతం కంపెనీ భారత్‌లో అయిదు మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో అమియో, వెంటో, పోలో మోడళ్ల ధర రూ.10 లక్షల లోపు ఉంది. 2017లో కంపెనీ నుంచి మొత్తం 47,500 కార్లు రోడ్డెక్కాయి. వీటిలో ఈ మూడు మోడళ్ల నుంచి 43,000 యూనిట్లు నమోదయ్యాయి. 2022 నాటికి రానున్న ఆరు మోడళ్లలో కూడా మూడు నాలుగు మోడళ్లు రూ.10 లక్షల లోపు విభాగంలోనే ఉంటాయని స్టీఫెన్‌ నాప్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు.

రూ.5–10 లక్షల ధరల శ్రేణిపైనే ఫోకస్‌ ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో కార్ల అమ్మకాల్లో రూ.10 లక్షలలోపు విభాగం వాటా 90–92% ఉందని వివరించారు. 2022 కల్లా కార్ల పరిశ్రమ 40 లక్షల యూనిట్లకు చేరుతుందని చెప్పారు. ఇక 2018లో సైతం కంపెనీ అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చని చెప్పారు. డీలర్‌షిప్‌ కేంద్రాలు ప్రస్తుతమున్న 124 నుంచి అయిదేళ్లలో 200కు చేరనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top