ఫలితాలు కీలకం

This is the analyst of the market momentum

దిగ్గజ బ్యాంక్, కంపెనీల ఫలితాలు ఈ వారమే

ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు

సూచీలు ప్రస్తుత స్థాయిల్లో కన్సాలిడేషన్‌ జరిగే అవకాశం

ఈ వారం మార్కెట్‌ గమనంపై విశ్లేషకుల మాట

ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులంటున్నారు. అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు ఈ వారంలోనే ఉండటంతో స్టాక్‌మార్కెట్‌ ఒడిదుడుకులకు గురికావచ్చని వారంటున్నారు. క్యూ2 ఫలితాలు, డెరివేటివ్స్‌ ముగింపుతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం తదితర అంశాలు కూడా స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయం.  

ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, విజయ బ్యాంక్‌లు, ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లు క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. వీటితో పాటు ఐటీసీ, హిందుస్తాన్‌ యూనిలివర్, మారుతీ సుజుకీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ, అంబుజా సిమెంట్స్,  ఏషియన్‌ పెయింట్స్,  ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్, బయోకాన్, సన్‌ ఫార్మా, యస్‌ బ్యాంక్,  కంపెనీల ఫలితాలు కూడా వస్తాయి.

జీఎస్‌టీ అమలు భారత కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఈ  ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. బ్యాంక్‌ ఫలితాలు అధ్వానంగా ఉండని పక్షంలో సెన్సెక్స్, నిఫ్టీలు ప్రస్తుత స్థాయిల్లోనే కన్సాలిడేట్‌ అవుతాయని విశ్లేషకులంటున్నారు.

భారీగానే ‘మొండి’ ప్రభావం !
కంపెనీల క్యూ2 ఫలితాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు కీలకమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ (రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌ జానెట్‌ ఎలెన్‌ ఈ వారాంతాన చేసే వ్యాఖ్యలు గమనించదగ్గ అంశమని పేర్కొన్నారు. మొండి బకాయిలు బ్యాంక్‌లపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. జీఎస్‌టీ అమలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనున్నదనే దిశగా కంపెనీల ఫలితాలు వస్తాయనే మార్కెట్‌ ఆశిస్తోందని వివరించారు.

జోరుగా విదేశీ డెట్‌ పెట్టుబడులు..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన డెట్‌ మార్కెట్లో పెట్టుబడుల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ 200 కోట్ల డాలర్ల మేర (రూ.12,135 కోట్లు )పెట్టుబడులు పెట్టారు. వడ్డీరేట్లు సానుకూలంగా ఉండడం, కరెన్సీ ఒడిదుడుకులు తక్కువ స్థాయిలో ఉండటంతో డెట్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐలు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులంటున్నారు.

ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు డెట్‌మార్కెట్లో నికరంగా రూ.1.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ నెలలో లాభాల స్వీకరణ ధ్యేయంతో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.3,408 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

ఒక ఐపీఓ, రెండు లిస్టింగ్‌లు
రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌  మేనేజ్‌మెంట్‌ ఐపీఓ ఈ నెల 25న ప్రారంభమై, 27న ముగుస్తుంది. ఈ ఐపీఓకు ధర శ్రేణిని రూ.247–రూ.252గా కంపెనీ నిర్ణయించింది.  రూ.1,542 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ షేర్లు వచ్చే నెల 6న స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.

మరోవైపు ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే్చంజ్‌ షేర్లు నేడు(సోమవారం) స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కానున్నాయి. రూ1,001 కోట్ల ఈ ఐపీఓ 2.28 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ.1,650. ఇక జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ షేర్లు బుధవారం(25న) స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కానున్నాయి. రూ.11,370 కోట్ల ఈ ఐపీఓ 1.38 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top