భారత్‌ నెత్తిమీద ఆర్థిక పిడుగు

Alarm Bells For the Indian Financial System - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వం హయాంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందంటూ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. అప్పుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 58 పైసల నుంచి 62 పైసల మధ్య ఊగిసలాడింది. ఇప్పుడు అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో గురువారం నాడు  డాలర్‌తో రూపాయి మారకం విలువ మొన్నెన్నడు లేనివిధంగా 69.10 రూపాయలకు పడిపోయింది.

డాలర్‌ విలువ పడిపోవడం అంటే భారత్‌ దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ఆర్థిక భారం అధికమవుతుందన్నది అర్థం. ముఖ్యంగా మనం దిగుమతి చేసుకునే 80 శాతం చమురుపై అధిక ఆర్థిక భారం పడుతుంది. పర్యవసానంగా ద్రవ్యోల్బణం శాతం పెరిగిపోయి సామాన్య మానవులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. నేడు చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడపోవడం వల్ల ముంచుకొచ్చే మరో ప్రమాదం గురించి తెల్సిందే. భారత్‌ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి పోతాయి. గత ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జూన్‌ 4వ తేదీ వరకు దేశం నుంచి 670 కోట్ల డాలర్ల పెట్టుబడులను విదేశీయులు ఉపసంహరించుకున్నారు.

రూపాయి మారకం విలువ పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల ఇప్పటికే దేశాన్ని పీడిస్తున్న సమస్యలు రెట్టింపు అవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఏటా 60 లక్షలకు మించి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు (అవి కూడా ఖాళీ అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారానే). దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం కూడా మందగమనంతోనే నడుస్తోంది. జాతీయ స్థూల ఉత్పత్తి కూడా గతేడాది 6.5 శాతమే. జీడీపీని రెండంకెలు దాటిస్తామంటూ మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ గత నాలుగేళ్లుగా జీడీపీ వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 6.5 శాతం మధ్యనే కొట్టుమిట్టాడుతోంది. మోదీ ప్రభుత్వానికి ముందు అంటే, 2013–2014 ఆర్థిక సంవత్సరంలో జీడీపి రేటు 7.5 శాతం నమోదయింది.

మరోపక్క బ్యాంకుల్లో మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు ఆందోళనకరంగా పెరిగి పోతున్నాయి. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల శాతం గత మార్చి నెల నాటికి 11. 6 శాతం ఉండగా, 2019 మార్చి నాటికి 12.2 శాతానికి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూలిగే నక్కమీద తాడి పండు పడ్డట్లు అమెరికా ఒత్తిళ్లకు లొంగిన భారత్‌ గురువారం నాడు ఇరాన్‌ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తామని ప్రకటించింది. భారత్‌కు చమురును దిగుమతి చేస్తున్న మూడవ అతిపెద్ద దేశం ఇరాన్‌. ఇరాన్‌ నుంచి దిగుమతులను నిలిపివేస్తే చమురు దిగుమతులపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. చమురు ధరలు పెరుగుతున్నా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు బెడిసికొట్టినా భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా కుప్పకూలకపోవడం అదృష్టమేనని, ఇది మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదని ‘జేపీ మోర్గాన్‌’ చీప్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఎకానమిస్ట్‌ జహంగీర్‌ అజీజ్‌ లాంటి అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన భారత్‌లో ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానన్నది నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి. ఇప్పుడాయన ఆర్థిక వ్యవస్థ గురించి అసలు పట్టించుకోకుండా ప్రధానంగా రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆయన హయాంలో అరుణ్‌ జైట్లీ పార్ట్‌టైమ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేస్తుండగా, ప్రధాన ఆర్థిక వ్యూహకర్త (చీఫ్‌ స్టాటిస్టిసియన్‌) మొదటి నుంచి లేరు. ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియన్‌ ఇటీవలనే తన రాజీనామాను ప్రకటించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top