ఎయిర్‌ ఏసియా సేల్‌: తక్కువకే విమాన టిక్కెట్‌

AirAsia launches year-end sale, flight fares start Rs1,299

ముంబై : బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఏసియా ఇండియా మరో ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇయర్‌-ఎండ్‌ సేల్‌ను ఆదివారం ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా తన కస్టమర్లకు దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు అత్యంత తక్కువగా రూ.1,299కే అందించనున్నట్టు ఎయిర్‌ ఏసియా తెలిపింది. అదే అంతర్జాతీయ ప్రయాణాలకైతే, రూ.2,399కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు పేర్కొంది. పరిమిత కాల వ్యవధిలో ఈ సేల్‌ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. నేటి మధ్యాహ్నం నుంచి ఈ ఆఫర్‌ కింద విమాన టిక్కెట్లను అందించడం ప్రారంభించి, అక్టోబర్‌ 15 వరకు నిర్వహించనుంది. అక్టోబర్ ‌2 నుంచి మార్చి 31 మధ్య ప్రయాణాలన్నింటికీ ఆ ఆఫర్‌ వర్తించనుందని ఎయిర్‌ ఏసియా ఇండియా పేర్కొంది. బెంగళూరు, రాంచి, హైదరాబాద్‌, పూణే, కోల్‌కత్తా, కొచ్చి, న్యూఢిల్లీ వంటి ఇతర మార్గాలను ఈ ఆఫర్‌ కవర్‌ చేయనుంది. 

రూ.2,399 నుంచి విమాన టిక్కెట్లు ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాల్లో కౌలాలంపూర్‌, బలి, బ్యాంకాక్‌, క్రాబి, ఫూకెట్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ, సింగపూర్‌, ఆక్‌లాండ్‌లతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, మధ్యప్రాచ్య, అమెరికా వ్యాప్తంగా 120కి పైగా గ్లోబల్‌ మార్గాలున్నాయి. అంతేకాక ఈ ప్రమోషనల్‌ ధరలు కొత్తగా ఎయిర్‌ సర్వీసులు లాంచ్‌ అయిన ప్రాంతాలకు వర్తించనున్నాయని ఎయిర్‌ ఏసియా తెలిపింది. ఎయిర్‌ఏసియా పోర్టల్‌ లేదా తన మొబైల్‌ యాప్ ద్వారా బుక్‌ చేసుకున్న టిక్కెట్లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనున్నట్టు చెప్పింది.   

Back to Top