ఏడాది ఆఖరుకల్లా ఎయిరిండియా ప్రైవేటీకరణ

Air India privatisation - Sakshi

జూన్‌ నాటికి తుది బిడ్డరు ఖరారు

కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తికాగలదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. సంస్థను దక్కించుకునే బిడ్డరు పేరు జూన్‌ నాటికల్లా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎయిరిండియాలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించిన మెమోరాండంను మరికొన్ని వారాల్లో విడుదల చేయనున్నట్లు సిన్హా చెప్పారు. ఏయే అసెట్స్‌ను విక్రయిస్తున్నారు, ప్రభుత్వ వాటా ఎంత ఉంటుంది తదితర అంశాలన్నీ ఇందులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటిదాకా రెండు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు తమ శాఖకు అందాయని మంత్రి వివరించారు. రుణభారంతో కుంగుతున్న ఎయిరిండియాను నాలుగు వేరు విభాగాలుగా విక్రయానికి ఉంచనున్నట్లు చెప్పారు. ఎయిరిండియా.. దాని చౌక చార్జీల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, అనుబంధ సంస్థ ఏఐఎస్‌ఏటీఎస్‌లను ఒక సంస్థగాను, ప్రాంతీయ విభాగం అలయన్స్‌ ఎయిర్‌ని మరో ప్రత్యేక సంస్థగా బిడ్డింగ్‌కి ఉంచనున్నారు.

అలాగే, ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ (ఏఐఏటీఎస్‌ఎల్‌), ఎయిరిండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ (ఏఐఈఎస్‌ఎల్‌)ను విడివిడిగా విక్రయించనున్నట్లు సిన్హా తెలిపారు. ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌నకు చెందిన ఎస్‌ఏటీఎస్‌ కలిసి చెరి సగం వాటాలతో ఏఐఎస్‌ఏటీఎస్‌ను ఏర్పాటు చేశాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top