
అహ్మదాబాద్ : ఉచిత వాయిస్ కాలింగ్, తక్కువకే ఎక్కువ డేటా అంటూ ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న రిలయన్స్ జియో, మరో సంచలనానికి సిద్ధమవుతోంది. భారత్‌లో దూసుకుపోతున్న ఈకామర్స్ మార్కెట్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని జియో ప్లాన్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. తనకున్న విస్తారమైన నెట్‌వర్క్, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో ఈ-కామర్స్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ వీధుల్లో ఉండే స్టోర్లు లేదా కిరణా షాపులతో కలిసి పనిచేస్తుందని, జియో మనీ ప్లాట్‌ఫామ్ లేదా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా డిజిటల్ కూపన్లను వాడుకుని పక్కనే ఉన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేలా ఆపరేషనల్ మోడల్‌ను సిద్ధంచేస్తుందని తెలిసింది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ముంబై, చెన్నై, అహ్మదాబాద్ సిటీల్లో పలు స్టోర్లకు, దిగ్గజ బ్రాండులకు కల్పిస్తోంది. వచ్చే ఏడాది దేశమంతటా దీన్ని ఆవిష్కరించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఏడాదిలో జియో 132 మిలియన్ సబ్‌స్క్రైబర్లను తన సొంతం చేసుకుని, చాలా వేగవంతంగా దూసుకెళ్తోంది. ఈ కంపెనీ ఆన్‌లైన్ టూ ఆఫ్‌లైన్ ఈ కామర్స్‌లోకి ప్రవేశిస్తే, ఇక పేమెంట్ కంపెనీలు పేటీఎం, ఫోన్‌పే లాంటివి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో ఉండే స్టోర్లు, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సి ఉంటుందని తెలిసింది. మరోవైపు ఈ కంపెనీలకు చాలా విస్తారమైన నెట్‌వర్క్ కూడా కలిగి ఉంది. ఆన్‌లైన్-టూ-ఆఫ్‌లైన్ బిజినెస్ మోడల్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు రిలయన్స్ జియో ఇంకా కామెంట్ చేయలేదు. 650 బిలియన్ డాలర్ల విలువ కలిగిన రిటైల్ ఇండస్ట్రీలో కేవలం 3-4 శాతం మాత్రమే ఈ-కామర్స్‌వి, మరో 8 శాతం షాపర్స్ స్టాప్, బిగ్ బజార్ లాంటి అధికారిక రిటైలర్లు ఆధీనంలో ఉన్నాయి. మిగతా 88 శాతం నుంచి 89 శాతం వరకు మార్కెట్ చిన్న దుకాణాలకే సొంతం.
ప్రస్తుతం జియో ఈకామర్స్ మోడల్ ఇంకా ఖరారు చేయలేదని, పైలెట్ ప్రాజెక్ట్ నుంచి పలు ఇన్‌పుట్‌లు సేకరించిన తర్వాత దీనిలో మార్పులు చేసి తుది రూపకల్పన చేస్తామని జియో ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ప్రస్తుత పైలెట్ ప్రాజెక్టు కోసం మాత్రం 15-20 బ్రాండులు ఎన్‌రోల్ చేసుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ ప్లాన్ కింద జియో, బ్రాండు ప్రొడక్ట్‌ల డిజిటల్ కూపన్ కోడ్‌లను మొబైల్ యూజర్లకు పంపుతుంది. ఈ కూపన్లను వాడుకుని పక్కనే వీధుల్లో ఉన్న స్టోర్‌లలలో ఆ బ్రాండులను కొనుగోలు చేసుకోవచ్చు. భాగస్వామ్య స్టోర్లలో స్టాక్ అయిపోవడం కోసం కూడా జియో తన ప్లాట్‌ఫామ్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. అంతేకాక కస్టమర్లకు ప్రమోషనల్ ఆఫర్లను కూడా జియో ఆఫర్ చేస్తుంది. జియో సబ్‌స్క్రైబర్ కాని వారు కూడా వీటిని వినియోగించుకోవచ్చు.