హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

83 persant of Hyderabadis have life insurance coverage - Sakshi

83 శాతం హైదరాబాదీలకు జీవిత బీమా భద్రత

దేశంలో మిగతా ప్రాంతాల వారికన్నా టాప్‌

మ్యాక్స్‌ లైఫ్‌ సర్వేలో వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిస్తే హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర వాసులదే పైచేయి!!. అయితే, అతి తక్కువ ప్రీమియంతో జీవితానికి రక్షణనిచ్చే టర్మ్‌ ప్లాన్స్‌ విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు. ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, కాంటార్‌ ఐఎంఆర్‌బీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

టెక్‌ నగరం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదీలకే రకరకాల జీవిత బీమా పాలసీల (టర్మ్‌ ప్లాన్, మార్కెట్‌ ఆధారిత ప్లాన్‌ మొదలైనవి) గురించి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ ఎండీ వి.విశ్వానంద్‌ చెప్పారు. వ్యక్తులు తమకు ఎంత వరకు భద్రత ఉందని భావిస్తున్నారు? భవిష్యత్‌ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మానసికంగా ఎంత మేర సన్నద్ధంగా ఉన్నారు? అనే అంశాల ప్రాతిపదికన బీమా భద్రతపై భారతీయుల వైఖరి (0–100 స్కేల్‌) నివేదికను తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు.

అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సన్నద్ధత, జీవిత.. టర్మ్‌ బీమాలపై అవగాహన, పాలసీల కొనుగోలుకు కారణాలు అనే మూడు అంశాల ఆధారంగా పాయింట్లను లెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం 100కి హైదరాబాద్‌ 44 పాయింట్లు సాధించిందని, జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నమోదైన 35 పాయింట్ల సగటుకన్నా ఇది అధికమని విశ్వానంద్‌ చెప్పారు. అయితే, హైదరాబాదీల్లో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కేవలం 23% మందికే ఉందని, భవిష్యత్‌లో ఆకస్మిక మరణం, తీవ్ర అనారోగ్యాల బారిన పడటం వంటి వాటిని 44% మంది ఆర్థికంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. ఉత్తరాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా జీవిత బీమా, టర్మ్‌ పాలసీదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశానికి ఐటీ హబ్‌గా పేరొందినప్పటికీ దక్షిణాదిలో 82% జనాభా ఇప్పటికీ ఏజెంట్ల నుంచే టర్మ్‌ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 15% మంది బ్యాంకుల నుంచి, 3% మంది మాత్రమే ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top