చందా కొచర్‌ పాత్రపై శ్రీకృష్ణ కమిటీ విచారణ

 Srikrishna To Head Probe Panel On Allegations Against Chanda Kochhar - Sakshi

సాక్షి, ముంబయి : ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపడుతోంది. రుణాల మంజూరులో నిబంధనలను ఉల్లంఘిస్తూ, క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని చందా కొచర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియ ప్రారంభమైందని సున్నితమైన, వివాదాస్పద అంశం కావడంతో తుది నివేదికకు కొంత సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చందా కొచర్‌పై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో మే 30న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

తుది విచారణ నివేదిక ఎప్పుడు సమర్పించాలనే దానిపై బోర్డు నిర్థిష్ట గడువును వెల్లడించలేదు. ఫోరెన్సిక్‌, ఈమెయిళ్ల పరిశీలన, రికార్డులు, సంబంధిత వ్యక్తుల స్టేట్‌మెంట్ల ఆధారంగా స్వతంత్ర విచారణ సాగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా సంబంధిత అంశాలన్నింటిపైనా విచారణ చేపట్టి తుది నివేదికను సమర్పిస్తారని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు దాఖలు చేసిన ఫైలింగ్‌లో బ్యాంక్‌ పేర్కొంది.

వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరులో ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించారని ఐసీఐసీఐ బ్యాంక్‌కు, చందా కొచర్‌కు సెబీ నోటీసులు జారీ చేసిన క్రమంలో స్వతంత్ర విచారణకు బ్యాంక్‌ ఆదేశించింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు, చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌కు చెందిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌ మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ సందేహం వ్యక్తం చేసింది. దీపక్‌ కొచర్‌కు ఆర్థిక సంబంధాలు కలిగిన వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాల జారీలో క్విడ్‌ ప్రోకో జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top