
జోరుగా జీరో దందా
అక్రమ మార్గంలో నిత్యం కిలోల కొద్ది బంగారు, వెండి ఆభరణాలు నెల్లూరుకు దిగుమతి అవుతున్నాయి.
నెల్లూరు(క్రైమ్): అక్రమ మార్గంలో నిత్యం కిలోల కొద్ది బంగారు, వెండి ఆభరణాలు నెల్లూరుకు దిగుమతి అవుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి బస్సులు, రైళ్లలో ఆభరణాల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రత్యేకంగా ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప పోలీసులూ స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. జిల్లాలో బంగారు ఆభరణాలకు బాగా డిమాండ్ ఉంది.
ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలో షోరూంలు కూడా నెల్లూరులో వెలుస్తున్నాయి. మరోవైపు మండపాలవీధి, కాకర్లవారివీధి పేర్లు చెబితే బంగారు దుకాణాలు గుర్తొస్తాయి. చిన్నవి,పెద్దవి కలిపి జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా బంగారు దుకాణాలున్నాయి. వీటిలో ఎక్కువ శాతం దుకాణాలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేవు. ఆయా దుకాణాల నిర్వాహకులు ఎంత మేర లావాదేవీలు జరుపుతున్నారన్నది ఎవరికీ తెలియదు.
పలువురు అధికారులకు తెలిసినా అందినకాడికి దండుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తదితర పన్నులు చెల్లించకుండానే భారీగా బంగారు దిగుమతి చేసుకుంటూ జీరో వ్యాపారం సాగిస్తున్నారు.
ఇలా ఎలాంటి బిల్లులు లేకుండా చేసే వ్యాపార(జీరో బిజినెస్) లావాదేవీలు జిల్లాలో నిత్యం రూ.50 కోట్ల మేర జరగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు రోజుకు రూ.6.5 కోట్ల మేర గండిపడుతోంది.
యథేచ్ఛగా అక్రమ రవాణా
తమిళనాడు, ముంబై, బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు రైలు, బస్సులతో పాటు ఇతర వాహనాల్లో నెల్లూరుకు దిగుమతి అవుతున్నాయి. పలువురు వ్యాపారులు బంగారు బిస్కట్లను దిగుమతి చేసుకుంటున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరు, సేలం, మహారాష్ట్రలోని ముంబై, కొల్లాపూర్, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన పలువురు బడా స్వర్ణకారులు నెల్లూరులోని ప్రముఖ దుకాణాలకు ఆర్డర్లపై నగలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ఆభరణాల రవాణా జరుగుతోంది. ఈ ఆభరణాల అక్రమ రవాణాలో లైన్ బిజినెస్ వ్యాపారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.
దొరికేది కొంతే
జీరో బిజినెస్ దందాకు వాణిజ్యపన్నులు, ఇన్‌కంట్యాక్స్, పోలీసు శాఖల అధికారులు అడ్డుకట్ట వేయాల్సి వుంది. ఏ శాఖ అధికారులూ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు లేవు. అయితే నెల్లూరు ఎస్పీగా సెంథిల్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసుశాఖలో కొంతమేర కదలిక వచ్చింది. అక్రమ వ్యాపారం మూలాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు.
రైలు, రోడ్డు మార్గాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తరచూ తనిఖీలు చేపడుతున్నారు. శనివారం కూడా నెల్లూరులోని రైల్వేఫీడర్స్‌రోడ్డులో తనిఖీలు కొనసాగాయి. మొత్తంగా నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 10 కిలోల బంగారు ఆభరణాలతో పాటు రూ.12 లక్షల నగదును సీజ్ చేశారు. శుక్రవారం ఒక్కరోజే ఆదాయపన్ను శాఖ అధికారులు వివిధ రకాల పన్నులు, అపరాధరుసుం రూపంలో బంగారం వ్యాపారుల నుంచి రూ.38 లక్షలు వసూలు చేశారు.
వరుసదాడుల నేపథ్యంలో లైన్‌బిజినెస్ చేసే వ్యక్తులు ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. అయితే దొరుకుతుంది గోరంతేనని, అక్రమంగా తరలిపోతున్నది కొండంత అని వ్యాపార వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిపెడితే ఈ జీరో వ్యాపార దందాకు తెరపడే అవకాశముంది.