రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు | YSRP district, criticized President Muralidhar | Sakshi
Sakshi News home page

రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు

Jul 28 2014 2:50 AM | Updated on Oct 20 2018 6:19 PM

రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు - Sakshi

రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు

రుణమాఫీపై రోజుకో తప్పుడు ప్రకటన చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ విమర్శించారు.

సాక్షి, నెల్లూరు : రుణమాఫీపై రోజుకో తప్పుడు ప్రకటన చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చారన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దంటూ ఆయన రైతులను రెచ్చగొట్టిన సందర్భాలున్నాయన్నారు. బాబు హామీలను నమ్మి జనం ఓట్లేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలను, డ్వాక్రా మహిళలను వంచిస్తున్నారని మేరిగ మండిపడ్డారు. జూన్ ప్రారంభానికి రైతులకు ఖరీఫ్ ప్రారంభమైందన్నారు.
 
 అప్పటికే పాతబకాయిలు చెల్లించి బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు పొందాల్సి ఉందన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారన్నారు. అయినా బాబు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మేరిగ విమర్శించారు.  ఇప్పుడు చంద్రబాబు రీ షెడ్యూల్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారని మేరిగ విమర్శించాడు. చంద్రబాబు చెప్పినట్టు రీషెడ్యూల్ ద్వారా రుణాలు అందించే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయన్నారు. ఇక డ్వాక్రా రుణాల పరిస్థితి ఇంతకు తక్కువేమీ కాదన్నారు. పేరుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పినా దీనిపై కూడా స్పష్టత లేదన్నారు.
 
 డ్వాక్రా రుణాలు రీ షెడ్యూల్ చేసే పరిస్థితి లేదని మేరిగ చెప్పారు. ఈ నెల చివరకు పంటల బీమా గడువు ముగుస్తుందన్నారు. ఇంతలోపు రైతులు రుణాలు పొందకపోతే భవిష్యత్‌లో పంటలు నష్టపోయినా బీమా వర్తించదన్నారు. ఇప్పటికైనా బాబు అబద్ధాలు మాని చిత్తశుద్ధితో అన్నదాతను ఆదుకునేందుకు ప్రయత్నించాలని మేరిగ మురళీధర్ హితవు పలికారు. రైతులకు అన్యాయం జరగకూడదని తమ పార్టీ ఆందోళనలకు దిగిందని మేరిగ చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement