ప్రజాసమస్యలపై చర్చకు పట్టుబడదాం


* వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయం

* శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

* ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా అధికారపక్షం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శ

* బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా చర్చకు గట్టిగా పట్టుబట్టాలని శాసనసభ్యులకు పిలుపు

* పింఛన్లలో కోత, మాఫీని నీరుగార్చడం, ఇంటికొక ఉద్యోగం హామీని పట్టించుకోని సర్కారుపై ఆగ్రహం

* కొత్త రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాన్ని కూడా ఎండగడతాం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

* రాజధాని కోసం ప్రవేశపెట్టే బిల్లులో ప్రజాకంటక అంశాలను ప్రతిఘటిస్తాం: జ్యోతుల నెహ్రూ

* అఖిలప్రియను టీడీపీ తరఫున పోటీ చేయిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు: భూమా నాగిరెడ్డి



సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వరుస వైఫల్యాలపై శాసనసభలో గట్టిగా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. గురువారం నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్‌ఎల్పీ బుధవారం ఇక్కడ సమావేశమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన శాసనసభ్యులు పాల్గొన్నారు. గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.



ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విషయంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఏ రకంగా వంచించిందో వివరించారు. ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా అధికారపక్షం తప్పించుకోవాలని చూస్తోందని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చ కోసం గట్టిగా పట్టుబడదామని జగన్ చెప్పా రు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై చేసే పోరాటంలో ఎమ్మెల్యేల మధ్య సమన్వయం చాలా అవసరమని తెలిపారు. ఈ సమావేశాల్లో అందర ం కలసికట్టుగా ప్రభుత్వాన్ని ఎదుర్కొందామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లలో కోత, రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీని నీరుగార్చడం, ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి పట్టించుకోకపోవడాన్ని జగన్ ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో పార్టీ ముఖ్య నే తలు ధర్మాన ప్రసాదరావు, డీఏ సోమయాజు లు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



ఒక్క మాటా నిలబెట్టుకోలేదు

సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు, కలమట వెంకటరమణ, ముస్తఫా, చాంద్‌బాషాలతో కలసి శాసన సభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గత ఆరు నెలల్లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, ఇసుక మాఫియా కార్యకలాపాలు, చేనేత కార్మికుల సమస్యలు, పింఛన్ల అర్హతను పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీల్లో కార్యకర్తల నియామకం వంటి అంశాలను సభలో లేవనెత్తాలని నిర్ణయించామన్నారు.



కొత్త రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాన్ని కూడా ఎండగడతామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగాలన్నింటినీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడా ఊసే ఎత్తడంలేదని అన్నారు. గత ఆరు నెలల్లో డీజిల్ ధరలు 8 రూపాయల వరకు తగ్గినప్పటికీ, పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు సభలో స్వీయ పొగడ్తలతో కాలం వెళ్లబుచ్చాలని చూస్తున్నారని, అలా కాకుండా ప్రజా సమస్యలపై చర్చకు ఎక్కువ అవకాశం కల్పించాలని కోరారు.



వివాహ శుభ కార్యాలు, వ్యక్తిగత పనులు, తక్కువ వ్యవధిలో సమాచారం పంపడం వంటి కారణాల వల్ల ఎమ్మెల్యేలు పూర్తి సంఖ్యలో శాసన సభాపక్ష సమావేశానికి హాజరు కాలేకపోయారని శ్రీకాంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గురువారంనాటి సమావేశాలకు అందరూ హాజరవుతారని చెప్పారు. సమావేశానికి ముందు శాసన సభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కొత్త రాజధాని కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ప్రజాకంటకమైన అంశాలను గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.



మేనిఫెస్టో అమలు చేయాలని కోరతాం

శాసన సభ సమావేశాల్లో తాము కొత్తగా ఏమీ కోరనవసరంలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందో వాటిని అమలు చేసి తీరాలని కోరతామని అన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నీ అపహాస్యం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.



కేసులకు భయపడను: భూమా

తనపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులకు భయపడబోనని పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి చెప్పారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో జరిగిన సంఘటనలపై సభలో ప్రస్తావిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలహీనపరిచి, నేతలను మానసికంగా దెబ్బ తీయాలన్న దురుద్దేశంతోనే ఇలా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఒక ఎమ్మెల్యేపై రౌడీషీటు పెట్టే స్థాయికి పోలీసులు వెళ్లారని దుయ్యబట్టారు.



ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో తన కుమార్తె అఖిలప్రియను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారని, అయితే తాను వారి ఒత్తిడికి లొంగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మనుషులే శాశ్వతం కానప్పుడు, పదవులు శాశ్వతమా అని ప్రశ్నించారు. రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే చంద్రబాబు కూడా మాజీ అవుతారని వ్యాఖ్యానించారు. పీఏసీ చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top