‘చంద్రబాబునే కేసీఆర్‌ బెజవాడ పటంలో పెట్టారు’


♦దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలి

♦సొంత నియోజకవర్గంలో గెలవలేక చంద్రబాబు సొల్లు కబుర్లు

♦చంద్రబాబులా దొంగదారులు వెతుక్కునే వ్యక్తి కాదు జగన్‌..

♦బాబు పాలనకు నూకలు చెల్లాయి

2019లో వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది




హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయిన ఆయన సొల్లు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఇంకా దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలన్నారు. అప్పుడు తాము రెఫరెండంగా స్వీకరిస్తామని అన్నారు.



ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు పోటుగాడు కాదు...అనుభవజ్ఞుడు కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయాడు. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే...21చోట్ల చంద్రబాబు డిపాజిట్ కోల్పోయారు. పది స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో 250మందికి పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఇస్తే 39మంది పంపారు...అవి కూడా చెల్లలేదు. అంటే ఉద్యోగులు వాళ్ల నిరసనను ఈ విధంగా తెలిపారు.


ఇప్పటివరకూ నారావారిపల్లెలో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే.. మూడుసార్లు మినహా అన్నిసార్లు ఓడిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సొంత నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేకపోయింది. కానీ చంద్రబాబు సొల్లు చెబుతారు. ఇందిరాగాంధీ, రాహుల్‌ గాంధీతో పోరాటం చేశానంటాడు. మనం వింటే బ్రిటీష్‌ వారితో కూడా పోరాటం చేశానని సొల్లు చెబుతారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానన్న నీచ చరిత్ర చంద్రబాబుది.’  అని తూర్పారబట్టారు.



జగన్‌ పోరాట యోధుడు..

ఓ ఎమ్మెల్యే, ఎంపీతో మొదలైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేపట్టే స్థాయికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. బాబు పాలనకు నూకలు చెల్లాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది.  ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా అన్నమాట మీద నిలబడే వ్యక్తి. మాట తప్పని, మడమ తిప్పని పోరాట యోధుడు. చంద్రబాబులా దొంగదారులు వెతుక్కునే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిపైనా విమర్శలా. మా పార్టీ గుర్తుపై గెలిచినవారా మా నాయుకుడిన విమర్శించేది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నంద్యాల వైఎస్‌ఆర్‌ సీపీ సీటు కాబట్టే పోటీ చేశాం.  చంద్రబాబు ధన, అంగబలం ఉపయోగిస్తాడని తెలిసి కూడా బాబు మాదిరిగా దొంగదారులు చూసుకోకుండా పోటీ చేసి పోరాటం చేసిన యోధుడు జగన్.



చంద్రబాబు 1999లో బీజేపీతో కలిసి పోటే చేస్తే 43 శాతం, 2004లో 37 శాతం, 2009లో 28 శాతం. ఆ తరువాత బై ఎలక్షన్ లో 22 శాతం. 2014 మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే 31 శాతం. చంద్రబాబు పార్టీ రోజురోజుకు తరుగుతుంది. చంద్రబాబుకు ఇంత రాజకీయ అనుభవం ఉండి అంత పోటుగాడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 44చోట్ల ఎందుకు గెలుచుకోలేకపోయాడు. బొబ్బిలి నుంచి టీడీపీ పార్లమెంట్ సభ్యుడు చనిపోతే వాళ్ల అబ్బాయిని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉప ఎన్నికలు జరిగితే 99శాతం అధికారానికే అవకాశం ఉంటుందని  కొడాలి నాని అన్నారు.  



విజయవాడ పటంలో పెట్టారు..

హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు గొప్పలు చెబుతారు. కానీ  ఓటుకు నోటు కేసులో దొంగలా దొరికిపోతే కేసీఆరే హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సర్దించి చంద్రబాబును విజయవాడ పటంలో పెట్టాడు.  చంద్రబాబు నీవు ఎలాంటోడివో, ఎలాంటి రాజకీయాలు చేస్తవో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు.



డేరా బాబా గురువే చంద్రబాబా..

డేరా బాబా గురువు చంద్రబాబా. నీపై సీబీఐ విచారణ జరిపితే జీవితాంతం జైల్లోనే ఉంటావు. చంద్రబాబు నమ్మకద్రోహి, దొంగ అని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును అడిగినా చెబుతారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తిని అడిగినా చెబుతారు అని ఎమ్మెల్యే నాని ధ్వజమెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top