నాటక ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు | ysrcp mla attend to inauguration of the drama | Sakshi
Sakshi News home page

నాటక ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

Jul 12 2014 1:14 AM | Updated on Sep 2 2017 10:09 AM

రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో భాగంగా ప్రదర్శించిన పలు నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కర్నూలు(కల్చరల్):  రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో భాగంగా ప్రదర్శించిన పలు నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్థానిక టీజీవీ కళా క్షేత్రంలో లలిత కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐదో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒక్కక్షణం, ఆనందం నాటకాల ప్రదర్శన నవరసభరితంగా సాగింది. పోటీలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ  నాటకాన్ని మారిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల దృష్ట్యా మరింత ఆధునీకరించి ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పౌరాణిక నాటకాలకు ఒకప్పుడు విశేషమైన ఆదరణ ఉండేదన్నారు. రాను రాను టీవీ సినిమాల వ్యామోహంలో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందుకే నాటకాన్ని ఈ కాలం యువత ఆసక్తికి అనుగుణంగా రాగాలాపనను తగ్గించి ఆధునిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేది నాటకమేనన్నారు. కర్నూలులోని లలిత కళా సమితి రూపొందించిన పులిస్వారీ నాటకం రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శితమై పేరు ప్రఖ్యాతులు గడించడం, బబ్రు వాహన నాటకాన్ని బంగారు నంది సాధించడం అభినందనీయమన్నారు. శ్రీశైల శాసన సభ్యుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కళా రంగానికి తమ కుటుంబం నిరంతరం సేవలందిస్తోందన్నారు. తన తండ్రి బుడ్డా వెంగళరెడ్డి కళల పట్ల, నాటకాలపై చక్కని ఆసక్తి కలిగి నాటక రంగాన్ని బాగా ప్రోత్సహించారని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ తాను కూడా కళా రంగానికి తగిన ప్రోత్సాహం కల్పిస్తానన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాజుల కాలంలో కళలకు బాగా ఆదరణ లభించిందని, ప్రస్తుత కాలంలో ప్రజలే కళా పోషకులుగా మారి కళలను ఆదరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోని కళాకారులకు తాము నిత్యం ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. అంతకుముందు టీజీవీ కళాక్షేత్రంలో బుడ్డా వెంగళ్‌రెడ్డి భవన్‌ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించి వెంగళ్‌రెడ్డి చిత్ర పటానికి పూల మాల సమర్పించారు.

 సీనియర్ రంగస్థల నటులకు సన్మానం: రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో భాగంగా రోజూ నలుగురు సీనియర్ రంగస్థల నటులను సన్మానించాలని సంకల్పించామని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం సీనియర్ రంగస్థల నటులు ఎన్.క్రిష్టఫర్, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, రాజారత్నం, సివి.రెడ్డిలను ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement