మేము చస్తున్నా..అగ్రిగోల్డ్‌పై చర్చించరా?

YSRCP leaders protest across the state together with Agrigold victims - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ‘అగ్రిగోల్డ్‌ సమస్య కంటే ప్రధానమైనవి ఉన్నాయి. సమయం సరిపోలేదు. అందుకే మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై చర్చించలేదు..’ ఇదీ శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నకు మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇచ్చిన జవాబు. రాష్ట్రంలోని 19.52 లక్షల ఖాతాదారులకు సంబంధించిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో మంత్రి సమాధానంతో అర్థం చేసుకోవచ్చు. పిల్లల చదువులకు, వారి పెళ్లిళ్లకు.. ఇలా అవసరానికి అక్కరకు వస్తాయనే ఆశతో దాచుకున్న సొమ్మును అగ్రిగోల్డ్‌ సంస్థ కాజేయడంతో బాధితుల వేదన వర్ణనాతీతంగా మారింది. తమను ఆదుకోవాలంటూ నాలుగేళ్లుగా వారు శాంతియుతంగా పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటికే మనోవ్యథతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 260 మందికిపైగా బాధితులు అర్ధాంతరంగా తనువు చాలించారు. అయినా కూడా ప్రభుత్వంలో చలనం రాలేదు.

వీరిలో కొందరికి మాత్రమే అరకొరగా పరిహారమందించి చేతులు దులుపుకుంది తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేకపోయింది. ‘మేము చస్తేనే పరిహారమిస్తారా.. బతికుండగా డిపాజిట్లు చెల్లించరా..’ అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కనీసం రూ.1,200 కోట్ల నిధులు కేటాయించినా రూ.20 వేల లోపు డిపాజిట్లున్న 75 శాతం బాధితులకు తక్షణ న్యాయం జరుగుతుందని బాధితులు వేడుకుంటున్నారు. అయితే ఏడాది కిందట రూ.300 కోట్లు గ్రాంటుగా ఇస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితుల సమస్యపై పలుమార్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతటితో ఆగిపోకుండా.. టీడీపీ ప్రభుత్వం స్పందించేలా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయిలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కో–ఆర్డినేటర్లను నియమించారు. ప్రభుత్వం ఇప్పుడు కూడా కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చించకపోవడంతో.. వైఎస్సార్‌సీపీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరాహారదీక్షలకు దిగింది. తాము చనిపోతున్నా.. అగ్రిగోల్డ్‌పై చర్చించే సమయం మీకు దొరకట్లేదా? అంటూ బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గం..  
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అగ్రిగోల్డ్‌ బాధితులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఏళ్లు గడుస్తున్నా బాధితులకు న్యాయం చేయరా? అంటూ నిలదీశాయి. అగ్రిగోల్డ్‌ అప్పుల కంటే ఆస్తులే ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డాయి. అగ్రిగోల్డ్‌ ఆస్తులను అప్పన్నంగా దోచేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించాయి. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కృష్ణా జిల్లావ్యాప్తంగా బాధితులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరాహార దీక్షలు, ధర్నాలకు దిగారు. కంకిపాడులో జరిగిన రిలే దీక్షకు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంపై కళ్లు తెరిచే వరకూ ఉద్యమిస్తామని పార్థసారథి చెప్పారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద బాధితులు చేపట్టిన రిలే దీక్షల్లో వైఎస్సార్‌సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అడపా శేషు, బొప్పన భవకుమార్‌ పాల్గొన్నారు. మోసపోయిన పేదలకు అండగా నిలుస్తామని తిరువూరులో ఎమ్మెల్యే కె.రక్షణనిధి హామీ ఇచ్చారు. గుంటూరు నగరంతో పాటు మంగళగిరి, అమరావతి, అమృతలూరు, వేమూరు తదితర మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాధితులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక ఒంగోలు జిల్లాలో జరిగిన ఆందోళనల్లో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్, బాధితుల కమిటీ జిల్లా అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాధితులు ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 

చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబుతాం.. 
వైఎస్సార్‌ జిల్లావ్యాప్తంగా జరిగిన అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళనలకు ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, నేతలు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. డిపాజిట్ల సొమ్ము చెల్లించకపోతే చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబుతామని బాధితులు హెచ్చరించారు. అనంతపురంలో జరిగిన నిరసనల్లో వైఎస్సార్‌సీపీ నేత మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో జరిగిన దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్‌ సంఘీభావం ప్రకటించారు. నంద్యాలలో భారీ ర్యాలీ, దీక్షలు నిర్వహించారు. నేతలు శిల్పామోహన్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన తదితరులు బాధితులకు బాసటగా నిలిచారు. ఇక చిత్తూరు, పీలేరు, శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ నేతలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. 

నయాపైసాతో సహా చెల్లిస్తాం..
బాధితుల ఆందోళనలు, నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పలాస, ఎచ్చెర్ల, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. పలుచోట్ల అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన నిరసనల్లో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, పరీక్షిత్‌రాజు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి, నక్కపల్లిలో భారీ ర్యాలీలు జరిగాయి. చంద్రబాబుకు ఇంగితజ్ఞానం ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు నయాపైసాతో సహా పూర్తిగా చెల్లింపులు చేస్తామని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. ఖాతాదారులు, ఏజెంట్ల రెక్కల కష్టాన్ని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలో మాజీ మంత్రి పి.విశ్వరూప్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top