
ఇడుపులపాయలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
వేంపల్లె: నా బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ వద్దకు వస్తున్నాడు.. ఆశీర్వదించండి అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రజలను కోరారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలసి ఆమె సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష, వైఎస్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరి వైఎస్ విమలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ ఆదివారం ఇడుపులపాయకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముందుగా ఉదయం వైఎస్‌ఆర్ ఘాట్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ విజయమ్మ విలేకరులతో మాట్లాడుతూ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజల కోసం తపన పడుతున్న జగన్‌ను రాష్ట్ర ప్రజలందరూ దీవించి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఏసుక్రీస్తు పొరుగు వారిని ప్రేమించాలని చెప్పారని... ఆవిధంగానే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అందరినీ ప్రేమించాలని చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నెమ్మళ్ల పార్కు పక్కన ఉన్న ఓపెన్ ఎయిర్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఫాస్టర్ నరేష్, బెనహర్‌బాబుల ఆధ్వర్యంలో వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు