ఓటుతో చింత తొలగిద్దాం..

Ys Sharmila Fires On Chinthamaneni - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరుటౌన్‌: ఒకవైపు యువకుడు, విద్యావంతుడు.. మీకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన కొఠారు అబ్బయ్య చౌదరి... ఇంకో వైపు దుర్మార్గుడు, మహిళలను గౌరవించనివాడైన చింతమనేని ప్రభాకర్‌ ఉన్నారు. బెదిరింపులకు లొంగిపోకుండా ఓటు అనే ఆయుధంతో ఆ దుర్మార్గునికి బుద్ధి చెప్పాలని వెఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల కోరారు. దెందులూరు నియోజకవర్గంలో షర్మిల రోడ్‌ షోకు అనూహ్య స్పందన వచ్చింది. విజయరాయిలో సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.

తొలుత నడిపల్లి వద్ద మత్స్యకారులతో షర్మిల ముఖాముఖి మాట్లాడారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను, బాధలను, సమస్యలను ఏకరువుపెట్టారు. వారి కష్టాలు విన్న షర్మిల మీ ప్రతీ సమస్యనూ పరిష్కరిస్తామని, జగన్‌ అన్న ముఖ్యమంత్రిగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని భరోసా కల్పించారు. అనంతరం అక్కడ నుంచి రోడ్‌ షో నిర్వహిస్తూ విజయరాయి సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో భారీ జనసందోహం మధ్య టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతిపై విరుచుకుపడ్డారు. దుర్మార్గుడు, మహిళలను గౌరవించని వాడు.  వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోను జట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లినవాడు. మనిషా లేక పశువా. ఇంత దుర్మార్గుడు.. ఒక తల్లికి పుట్టినవాడు కాదా... తన భార్య మహిళ కాదా... అక్క చెల్లెళ్ళు లేరా... మహిళ అని చూడకుండా వ్యవహరించిన వాడు మృగం కాదా అంటూ చింతమనేనిపై నిప్పులు చెరిగారు.

ఇసుక మాఫియా నుండి లిక్కర్‌ మాఫియా వరకు ప్రతి ప్రాజెక్టులో, కొల్లేరులో కమీషన్లు కొట్టేయడంలో  చింతమనేని ఉన్నాడు. మీలో ఒక్కరైనా ప్రభాకర్‌ మంచివాడు ఒక మంచిపని చేశాడని చెప్పగలరా. అలాంటి దుర్మార్గుడు, అసెంబ్లీకి పోవడానికి అర్హుడా...  ఐదేళ్లు దోచుకున్నాడు. ప్రజలను ఎంత హింస పెట్టాడో. ఏం చేశాడో తెలుసు.  ఈ ఎన్నికలే మీ ఆయుధం. ఆయన బెదిరింపులకు భయపడవద్దు. మోసపోకండి.. డబ్బులకు లొంగిపోకండి.. తెలుగుదేశం ప్రభుత్వానికి, చింతమనేని ప్రభాకర్‌కి ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. ఇలాంటి వాడికి చంద్రబాబు టికెట్‌ ఇచ్చాడు అంటే చంద్రబాబు ఎంత దుర్మార్గుడో తెలుసుకోండి అన్నారు. చింతమనేనికి డిపాజిట్‌ కూడా రాకుండా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరిని గొప్ప మెజార్టీతో గెలుపించుకోవాలన్నారు. ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ మీ మధ్య ఉంటున్నాడు. మీ సమస్యలు తెలుసుకుంటున్నాడు. కొల్లేరు అయినా ఇంకేదైనా  అన్నింటికి పరిష్కారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం. అందుకే మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుకే వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని షర్మిల స్పష్టం చేశారు. 

రాజన్న రాజ్యం వస్తోంది
రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు ఒక పండుగ అవుతుంది. మళ్ళీ రైతు రాజు అవుతాడు. ప్రతి రైతుకు మే నెలలో పెట్టుబడి ఏడాదికి రూ.12,500 ఇస్తారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రూ.4 వేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కచెల్లెళ్ళకు రుణం ఎంతైతే ఉందో నాలుగు దఫాలుగా æమాఫీ చేస్తూ మీ చేతుల్లోనే పెడతారు.  వడ్డీలేని కొత్త రుణాలు ఇస్తారు. మీ పిల్లలు ఏం చదివినా డాక్టరైనా, ఇంజనీరైనా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా ఏ కోర్సు తీసుకున్నా మొత్తం ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. దానికి అదనంగా రూ.25 వేలు హాస్టల్, మెస్‌ ఫీజులకు ప్రతి విద్యార్థికి ఇస్తాం. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆసుపత్రులను చేర్చుతాం. అక్క చెల్లెళ్ళు పిల్లలను బడికి పంపడానికి సంవత్సరానికి రూ.15 వేలు ఆ అమ్మ చేతిలోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళు దాటితే ఏడాదికి రూ.75 వేలు వైఎస్సార్‌ చేయూత కింద ఆర్థిక సహాయం చేస్తాం. ఇవన్నీ చేయాలంటే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని షర్మిల కోరారు. 

రోడ్‌ షో సాగిందిలా..
విజయరాయిలో భారీ సభ అనంతరం వేలాదిమంది వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో షర్మిల రోడ్‌ షో చింతలపాటివారి గూడెం, రాయన్నపాలెం, రాట్నాలగుంట, సూర్యారావుపేట, పెదవేగి, దిబ్బగూడెం, గార్లమడుగు, కవ్వగుంట, లక్ష్మీపురం, ఒంగూరు గ్రామాల మీదుగా సాగింది. మహిళలు హారతులు పడుతూ విజయం సాధించాలంటూ ఆశీర్వదించారు.  భారీ సంఖ్యలో మోటారుసైకిల్‌ ర్యాలీ షర్మిల వెంట సాగింది. ఆయా గ్రామాలలో పెద్దసంఖ్యలో చేరిన ప్రజలు, మహిళలకు షర్మిల అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, మాజీ మంత్రి మరడాని రంగారావు, బొమ్మారెడ్డి చంద్రారెడ్డి, పర్వతనేని నాగయ్య,  పీవీ రావు, మెండెం ఆనంద్, ఆళ్ళ సతీష్‌చౌదరి, కమ్మ శివరామకృష్ణ, వీరమాచినేని నాగబాబు, మట్టా గోపాలరావు, ముంగర సంజీవ్‌కుమార్, జానకిరెడ్డి, లేగల శివ, బొమ్మబోయిన నాని, మెట్లపల్లి సూరిబాబు, అప్పన ప్రసాద్, తేరా ఆనంద్, మాజీ ఎంపీపీ చల్లా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top