వలకు భరోసా

YS Jaganmohan Reddy Distribute Money For Fisherman - Sakshi

నేడు మత్స్యకారులకు వేట నిషేధ భృతి

కష్టకాలంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం

నరసాపురం: సముద్రంలో వేట సాగించే మత్స్యకారులకు వేట నిషేధభృతిని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అందజేయనుంది. నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమకానుంది. వేట నిషేధం కారణంగా ఉపాధి లేక ఇంట్లోనే ఉన్న మత్స్య కార్మికులు ఒక్కొక్కరికి రూ.10 వేల  చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. చేపల పునరుత్పత్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం సముద్రంలో వేటను ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకూ అమలు చేస్తుంది. ఈ 61 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఏప్రిల్‌ 15వ తేదీకి 20 రోజుల ముందే వేట బంద్‌ చేశారు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ సాయాన్ని ముందుగానే ఇస్తుంది. నిజానికి వేట నిషేధ భృతిని మళ్లీ తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి అందించేవారు. 

1112 మంది లబ్ధిదారులు జిల్లాలో నరసాపురం ప్రాంతంలో
19 కి.మీ. తీరప్రాంతం ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్రంలో బోట్లపై వేట సాగించేవారు 1112 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.1.11 కోట్లు అందించనున్నారు. ఆధార్‌ నెంబర్లు, సాంకేతిక ఇబ్బందుల కారణంగా 20 మందికి బుధవారం సొమ్ము జమకావడంలేదని, మిగతా అందరికీ జమ అవుతుందని నరసాపురం మత్స్యశాఖ అధికారి ఏడుకొండలు చెప్పారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది 990 మందిని మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశారు.  

గంగపుత్రులను వరించిన సంక్షేమం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. గత ఏడాది నవంబర్‌ 21న జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార భరోసా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. టీడీపీ హయాంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.4 వేలు ఇచ్చేవారు. అదీ కేవలం 300 మందికి మాత్రమే. సముద్రంలో వేట సాగిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. బోటు యజమానులకు కూడా మేలు చేసింది. వేట బోట్లకు డీజిల్‌ రాయితీని లీటర్‌కు రూ.9కు పెంచారు. ఇంతకు ముందు రూ.6.03 మాత్రమే ఇచ్చేవారు. నెలకు 300 లీటర్ల చొప్పున 10 నెలలకు 3 వేల లీటర్ల డీజిల్‌కు సబ్సిడీ ఇస్తున్నారు.  

మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా..  
మత్స్యకార భరోసా పథకంలో భాగంగా నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితిని అర్థం చేసుకుని నెల ముందుగానే వేట నిషేధ భృతి అందిస్తున్నారు. ఇక జిల్లాలో మత్స్య ఎగుమతుల అభివృద్ధికి నరసాపురంలో రూ.450 కోట్లతో 600 ఎకరాల్లో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి కూడా సీఎం చర్యలు తీసుకుంటున్నారు.   –ఎమ్మెల్యే ముదునూరిప్రసాదరాజు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top