‘రాజన్న బిడ్డ’కే గోదారి గడ్డ పట్టం

Ys Jagan Wins East Hearts - Sakshi

 ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ తునాతునకలు

జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం

3 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం

నాలుగు స్థానాలకే పరిమితమైన టీడీపీ

జనసేన ఖాతాలోకి రాజోలు

రాజన్న బిడ్డకే గోదారి గడ్డ పట్టం కట్టింది. కళ్లారా తమ కష్టాలు చూసి ఎద కదిలిపోయిన వాడికే; కాళ్లు పుళ్లయినా సడలని సంకల్పంతో.. తన అడుగులకు ఆత్మీయతను జోడించి.. తమ బతుకుల గతుకులను అధ్యయనం చేసిన బాటసారికే; మమతతో కన్నీళ్లు తుడిచిన మనసున్న మారాజుకే జేజేలు పలికింది. అయిదేళ్లుగా అలముకున్న అంధకారంలో నవోదయం లాంటి నవరత్న పథకాల రూపకర్త సారథ్యానికే సమ్మతిని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 3 లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాల్లో  వైఎస్సార్‌ సీపీకి విజయం చేకూర్చి.. జననేత జగన్‌పై తిరుగులేని ఆదరణను చాటింది. అర్ధ దశాబ్ది భ్రష్ట, దుష్టపాలన నుంచి; నమ్మి అధికారమిచ్చిన ప్రజలను తృణప్రాయులుగా పరిగణించి, పరాభవించిన ‘చంద్రుని’ గ్రహణం నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడంలో తూరుపు సీమ కీలక భూమిక పోషించింది. మండుటెండల వేళ ఊరడించిన మలయ పవనంలా.. జనకంటక అధ్యాయానికి తెరపడి, పదవిని ప్రజాసేవకు దక్కిన పవిత్రమైన అవకాశంగా భావించే జనరంజక పాలన ప్రారంభం కానున్న వేళ.. వనసీమ నుంచి కోనసీమ వరకూ ఆనందంతో పులకాంకితమైంది. 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫ్యాన్‌ సృష్టించిన ప్రభంజనానికి సైకిల్‌ గడ్డిపోచలా ఎగిరిపోయి.. తునాతునకలైపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సృష్టించిన సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. ‘నవ’వసంతంలో నడుస్తున్న వైఎస్సార్‌ సీపీపై వెల్లువెత్తిన ప్రజాభిమానం ముందు.. మూడున్నర దశాబ్దాలకు పైబడిన టీడీపీ.. దిక్కుతోచని స్థితిలో తల వంచేసింది. కోలుకోలేని ఓటమిని చవిచూసింది. ప్రజాగ్రహానికి ఎంతటి వారైనా తల వంచక తప్పదని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోసారి తేటతెల్లం చేశాయి. అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక పాలనతో అష్టకష్టాలకు గురి చేసిన టీడీపీ ప్రభుత్వానికి జిల్లా ప్రజలు కసి తీరా బుద్ధి చెప్పారు. ఫలితంగా జిల్లాలో టీడీపీ కంచుకోటలను వైఎస్సార్‌ సీపీ బద్దలుగొట్టింది. మూడు పార్లమెంట్‌ స్థానాలతో పాటు అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాల్లో  విజయదుందుభి మోగించింది. తద్వారా జిల్లా రాజకీయ ముఖచిత్రంలో కొత్త అధ్యాయాన్ని వైఎస్సార్‌ సీపీ లిఖించింది. కాకినాడలోని జేఎన్‌టీయూ, రంగరాయ వైద్య కళాశాల, ఐడియల్‌ ఇంజినీరింగ్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్, జేఎన్‌టీయూ క్రీడా మైదాన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను సాధించింది.

జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా 14 చోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, అనపర్తి, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, కొత్తపేట, రంపచోడవరం, రాజానగరం నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, పెద్దాపురం, మండపేటలో మాత్రమే గెలిచింది. జనసేన పార్టీ రాజోలులో తొలిసారి అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించింది. అనపర్తి నుంచి వైఎస్సార్‌ సీపీకి చెందిన సత్తి సూర్యనారాయణరెడ్డి జిల్లాలోనే 55,207 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత నాగులాపల్లి ధనలక్ష్మి రంపచోడవరం నుంచి 39,106 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తరువాతి స్థానంలో రాజానగరం నుంచి జక్కంపూడి రాజా 31,772 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని 30,436 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తరువాత అమలాపురం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌ 27,200 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేన తరఫున రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు 810 ఓట్ల అత్యల్ప ఆధిక్యతతో గెలుపొందారు.

మెట్టలో మరోసారి వైఎస్సార్‌ సీపీ ఆధిక్యత
2014 ఎన్నికల్లో జిల్లాలోని మెట్ట ప్రాంతమైన జగ్గంపేట, తుని, ప్రత్తిపాడుతో పాటు ఏజెన్సీలోని రంపచోడవరంలో గెలిచిన వైఎస్సార్‌ సీపీ.. ఈసారి ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో మరింత బలం పెంచుకుంది. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. తుని నుంచి దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు నుంచి పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, పిఠాపురం నుంచి పెండెం దొరబాబు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, రాజానగరం నుంచి జక్కంపూడి రాజా, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌ నుంచి కురసాల కన్నబాబు విజయం సాధించారు. మెట్ట పరిధిలోకి వచ్చే అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణరెడ్డి గెలిచారు. జిల్లాలోని ఏకైక ఏజెన్సీ నియోజకవర్గమైన రంపచోడవరంలో కూడా మరోసారి వైఎస్సార్‌ సీపీ పతాక రెపరెపలాడింది. ఆ పార్టీ తరఫున నాగులాపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు.

కోనసీమలో పట్టు సాధించిన వైఎస్సార్‌ సీపీ
కోనసీమలో వైఎస్సార్‌ సీపీ పట్టు సాధించింది. అంచనాలకు మించి బలం పెంచుకుంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్, పి.గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, ముమ్మిడివరం నుంచి పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, రామచంద్రపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డి విజయం సాధించారు.

జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు   : 19
వైఎస్సార్‌ సీపీ : 14,    టీడీపీ : 4,      జనసేన : 1
జిల్లాలోని ఎంపీ స్థానాలు మూడూ వైఎస్సార్‌ సీపీ కైవసం.
అత్యధిక మెజార్టీ         :   55,207 :
డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ సీపీ, అనపర్తి
రెండో అత్యధిక మెజార్టీ :      39,106 : నాగులాపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ, రంపచోడవరం
మూడో అత్యధిక మెజార్టీ :     31,772 : జక్కంపూడి రాజా ఇంద్రవందిత్, వైఎస్సార్‌ సీపీ, రాజానగరం
అత్యల్ప మెజార్టీ :     810 : రాపాక వరప్రసాదరావు, జనసేన, రాజోలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top