శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ 

ys jagan murder attempt: Visakha court Srinivas bail petition dismissed - Sakshi

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకు బదిలీ నేపథ్యం 

నిందితుడిని ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులు

విశాఖ లీగల్‌/అల్లిపురం (విశాఖ దక్షిణం):  ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను విశాఖ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ నెల 9న శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు ఈ నెల 4న ఎన్‌ఐఏకు బదిలీ అయినందున ఎన్‌ఐఏ పీపీకి నోటీసు ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు గురువారం సలీమ్, ఎన్‌ఐఏ పీపీ సిద్దరాములుకు నోటీస్‌ అందజేసి, దానిని కోర్టువారికి అందజేశారు. ఈ మేరకు మేజిస్ట్రేట్‌ ఎన్‌ఐఏ పీపీ ని వివరణ కోరగా.. ఆయన కేసుకు రికార్డుల నిమిత్తం 3వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. ఇంకా రికార్డులు ఏపీ పోలీసుల నుండి తమకు చేరలేదని విన్నవించారు. దీంతో న్యాయమూర్తి కేసు ఎన్‌ఐఏకి బదిలీ చేసినందున కోర్టు పరిధిలోకి రాదని తెలియజేశారు. న్యాయవాది సలీమ్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు.

కాగా ఎన్‌ఐఏ అధికారులు ఈ నెల 7న కేసు రికార్డులు తమకు అప్పగించాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. జనవరి 1న (ఆర్‌సీ నంబరు 01/2019/ఎన్‌ఐఏ/హైదరాబాద్‌) ఎఫ్‌ఐఆర్‌ నమోదైనందన రికార్డులు అప్పగించాలని కోరారు. ఈ మేరకు న్యాయమూర్తి గురువారం సాయంత్రం కేసు రికార్డులను ఎన్‌ఐఏ అప్పగించే నిమిత్తం విజయవాడకు తరలించారు.  

ఎన్‌ఐఏకు నిందితుడి అప్పగింత 
నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ శుక్రవారం వరకు ఉండటంతో గురువారం సాయంత్రం నిందితుడిని ఎన్‌ఐఏకు అప్పగిస్తూ వారెంట్‌ జారీ చేశారు. ఉత్తర్వులు అందినట్లు జైలు అధికారులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి దాటాక శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ తరలించారు. అతడిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top