9 మందితో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా

YS Jagan Mohan Reddy Release First MP Candidates List - Sakshi

9మంది అభ్యర్థులతో వైఎస్సార్ సీపీ లోక్‌ సభ అభ‍్యర్థుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం తొమ్మిది మంది పేర్లను ఇందులో ప్రకటించారు. తొలి జాబితాలో బలహీనవర్గాలకు వైఎస్సార్‌సీపీ పెద్ద పీట వేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం రాత్రి 9.15 నిమిషాలకు ఈ జాబితాను విడుదల చేశారు. ఇది మంచి ముహూర్తమని స్వామి స్వరూపానందేంద్ర స్వామి చెప్పడంతో ఈ జాబితాను వెల్లడించినట్లు ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కోర్‌ కమిటీ సభ్యులు అన్ని విధాలుగా చర్చించి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిందని వేమిరెడ్డి చెప్పారు. ఇప్పుడు ప్రకటించిన 9 లోక్‌సభ అభ్యర్థులు పోనూ మిగతా వారి జాబితాను, 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం ఇడుపులపాయలో అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తారని ఆయన తెలిపారు. ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో మొత్తం తొమ్మిది మందికిగాను ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ అభ్యర్థి ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు తొలి జాబితాలో ఉన్నారు. ఇంకా 16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. రెండోసారి టికెట్లు దక్కించుకున్న పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా సాధన పోరాటంలో తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
కొత్తవారికే ప్రాధాన్యం: ఇదిలా ఉండగా, లోక్‌సభకు ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులలో ఏడుగురు కొత్తవారే కావడం విశేషం. వీరందరూ దాదాపుగా కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాయలసీమలో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నపుడు జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కనీసం ఒక ఎంపీ సీటును బీసీలకు కేటాయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఈ రెండు జిల్లాల్లోని మొత్తం నాలుగు స్థానాల్లో అసాధారణమైన రీతిలో మూడు స్థానాల్లో బీసీ అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసింది. అనంతపురంలో రెండు లోక్‌సభ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులనే ఎంపిక చేయడం చెప్పుకోదగిన విశేషం. కర్నూలు జిల్లాలో ఒక సీటును బీసీలకు కేటాయించారు. ఈ రెండు జిల్లాల్లో బీసీలకే పార్లమెంటు స్థానాల్లో పెద్ద పీట వేయడం సాహసోపేతమైన చర్యగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. అనంతపురం టికెట్‌ ఇచ్చిన తలారి రంగయ్య మాజీ ప్రభుత్వ ఉన్నతోద్యోగి, హిందూపురం అభ్యర్థిగా ఎంపికైన గోరంట్ల మాధవ్‌ మాజీ పోలీసు అధికారి కావడం గమనార్హం.  

ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదీ..
కడప– వైఎస్‌ అవినాష్‌రెడ్డి, అరకు– మాధవి గొట్టేటి(ఎస్టీ),బాపట్ల – నందిగం సురేశ్‌ (ఎస్సీ), అమలాపురం –చింతా అనూరాధ (ఎస్సీ), అనంతపురం– తలారి రంగయ్య (బీసీ), కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌(బీసీ), రాజంపేట – పి.మిథున్‌రెడ్డి, చిత్తూరు – రెడ్డప్ప(ఎస్సీ), హిందూపురం– గోరంట్ల మాధవ్‌(బీసీ). 

చదవండి:
పవన్‌కు గేదెల శ్రీనుబాబు ఝలక్‌
తప్పు చేశా, శిక్ష కూడా అనుభవించా
వైఎస్సార్‌ సీపీలోకి విశాఖ సీనియర్‌ నేత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top