కుయ్‌..కుయ్‌ రయ్‌..రయ్‌

YS Jagan Focus on 108 Ambulance Services - Sakshi

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అతికొద్ది రోజులకే కీలకమైన వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాలపై దృష్టిసారించారు. ఆ మేరకు 108అంబులెన్స్‌లను గాడిలో పెట్టాలని
సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఫలితంగా గత తెలుగుదేశంపార్టీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన108 విభాగంలో సమూల మార్పులుజరగనున్నాయి.   

కడప రూరల్‌: జిల్లా వ్యాప్తంగా ‘108’ వాహనాలు రెండు బ్యాకప్‌తో కలిపి  మొత్తం 30 వాహనాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో అనుసరించిన విధానాల కారణంగా 108 అంబులెన్స్‌ల వ్యవస్థ  ప్రమాదంలో పడింది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ కారణంగా అధికారులు ‘108’కు మరమ్మతులు ప్రారంభించారు.
జిల్లాలో ఇదీ పరిస్ధితి: గత ఏడాది డిసెంబర్‌ 13వ తేదీన 108 వ్యవస్థ జీవీకే నుంచి యూకేఎస్‌ఏఎస్,  బీవీజీ సంయుక్త ఆధ్వర్యంలోకి వచ్చింది. అంతకుముందు అరకొరగా ఉన్న సమస్యలు సంస్థ మార్పుతో మరింతగా ఎక్కువయ్యాయి. కాగా ఈ వాహనాలు తిరగాలంటే  కండీషన్‌లో ఉండాలి. ప్రధానంగా డీజల్‌ సమస్య ఉండకూడదు. అయితే ఈ రెండు సమస్యలు ఆ వాహనాలను పట్టి పీడిస్తున్నాయి. ఒక వాహనానికి నెలకు డీజల్, మరమ్మతులు, సిబ్బంది వేతనాలకు రూ 1.10 లక్షలు రావాలి. అయితే ఈ నిధులు సక్రమంగా అందడంలేదు. దీంతో చాలా వాహనాలకు కొత్త టైర్లను మార్చలేని పరిస్థితి నెలకొంది. అలాగే వాహనాలు కండీషన్‌లో లేని కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. ఆ ప్రకారం మొత్తం 30 వాహనాలకు గాను చాలా బండ్లు కండీషన్‌లో లేవు. అలాగే వాహనాలకు ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా లేకపోవడం దారుణం.  ఇక తిరుగుతున్న వాహనాల్లో చాలా వరకు టైర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఆ వాహనాల టైర్లు ఎక్కడ పడితే అక్కడ  పేలిపోతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు టైర్లు పంక్చర్‌ అవుతున్నాయి. దీంతో బాధితులు మార్గ మధ్యంలోనే  వేరే వాహనాల్లో వెళుతున్నారు.

ఇబ్బందుల్లో సిబ్బంది: రెండు వాహనాలకు సగటున 5 మంది టెక్నీషియన్స్, 5 మంది పైలెట్లు ( డ్రైవర్లు) షిప్టుల ప్రకారం విధులను చేపడతారు. ఆ ప్రకారం ఒక వాహనానికి ఒక రోజుకు (24 గంటల్లో) దాదాపు 15 కేసులు వస్తాయి. అందులోను రాత్రి పూట వచ్చే కేసులు అధికంగా ఉంటాయి. దీంతో సిబ్బందిపై పనిభారం పడుతోంది. పైలెట్లు, టెక్నీషియన్స్‌ మొత్తం 136 మంది ఉండాలి. అయితే 122 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరంతా 12 గంటల పాటు విధులను చేపడుతున్నారు. సాధారణంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. అలా అయితే సిబ్బంది సంఖ్యను అందుకు అనుగుణంగా పెంచాలి. యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచించడంలేదు. కాగా ప్రస్తుతానికి సిబ్బందికి రెండు నెలల వేతనం అందాల్సి ఉంది.

2007లో వైఎస్‌ తెచ్చిన ‘108’
నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పలు ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టారు. ఆ ప్రకారం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అందులో భాగంగా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడానికి నడుం బిగించారు. ఆ మేరకు 2007లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. ఈ వాహనాల రాకతో నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి. రాష్ట్రంలో ఈ వ్యవస్థ విజయవంతం కావడంతో 108 వాహనాలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఈ వాహనాలు కష్టాల నడుమ ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టడంతో ‘108’ వ్యవస్థ గాడిలో పడనుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top