
పార్టీలో చేరిన వారితో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సమన్వయకర్త సుధీర్‌రెడ్డి
సాక్షి కడప: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు..అలాంటిది మంత్రి ఆది ఇలాకా కావడం.. కంచుకోటలాంటి గొరిగెనూరులో వైఎస్సార్ సీపీ పాగా వేస్తుందంటే జీర్ణించుకోలేకపోయిన వారు ఎలాగైనా అడ్డుకునేందుకు వ్యూహ రచన చేశారు. పోలీసుల ద్వారా గృహ నిర్బంధం చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఎట్టేకేలకు మార్గం సుగమమైంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నా పోలీసులు అడ్డుకున్న వైనంపై కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్‌సుధీర్‌రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామానికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. గతంలో పెద్దదండ్లూరు విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. బుధవారమే మాజీ ఎంపీతోపాటు సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు వెళ్లాల్సి ఉండగా, పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకునే విషయంలో గ్రామానికి వెళ్లాల్సిందేనని నేతలు పట్టుబట్టినా పోలీసులు ముందుకు కదలనివ్వలేదు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం, పోలీసుల తీరుపై మండిపడిన ధర్మాసనం 144 సెక్షన్‌ను అతిక్రమించకుండా పర్యటించవచ్చని ఆదేశించడంతో శుక్రవారం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ఎట్టకేలకు గ్రామంలో పర్యటించారు.
మంత్రి ‘ఆది’ కోటకు బీటలు
రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇలాకాలో అధిక ప్రాధాన్యత ఉన్న ఏడు గ్రామాల్లో గొరిగెనూరు ఒకటి. ఇక్కడ వైఎస్సార్ సీపీ నేతలు అడుగు పెట్టడాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే రకరకాల ఆటంకాలు సృష్టించినా ఎట్టకేలకు మాజీ ఎంపీ, సమన్వయకర్తలు గ్రామంలో పర్యటించారు. ఆది కోటలో వలసల తొలి అడుగుతో కంచుకోట బీటలు వారిందని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలోనూ పెద్దదండ్లూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరుసటిరోజు నూతన జంటలను ఆశీర్వదించడానికి వెళుతున్న సందర్భంలోనూ మంత్రి వర్గం నానారభస సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గిరిగెనూరు ఒక్కటే కాదు..మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వైఎస్సార్ సీపీ పంజా విసురుతుందని, అన్ని గ్రామాల్లోనూ జెండా ఎగుర వేస్తామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తేల్చి చెప్పారు.
వైఎస్సార్ సీపీలో చేరిన 42 కుటుంబాలు
మంత్రి ఆదికి బాగా పట్టున్న గ్రామమైన గొరిగెనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డిల సమక్షంలో గ్రామానికి చెందిన సుమారు 42 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
గ్రామానికి చెందిన గోంగటి భాస్కర్‌రెడ్డి, ఆయన సొదరుడు గోంగటి రమణారెడ్డి, ఓబులేసు, నీలకంఠా, కల్కి సుధాకర్, లక్ష్మీ నరసింహ్ములు, చిన్న వెంకటరమణ, చిన్న ఓబులేసు, క్రిష్ణయ్య, కోడూరు లక్షుమయ్య, నడిపి ఓబులేసు, మూలింటి పెద్దనరసింహులు, మూలింటి అమ్మన్న, మేకల ఓబులేసు, మూలింటి ఆదినారాయణ, సాకే చంద్ర ఓబులేసు, రవీంద్రబాబు, తలారి నరేష్, కల్కి కలికయ్య పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన దళిత వర్గాలు తమ ఇళ్ల వద్దకు రావాలని వైఎస్సార్ సీపీ నేతలను ఆహ్వానించాయి. దీంతో వారి మాట మన్నించి ఇరువురు నేతలు వెళ్లి పలుకరించి వచ్చారు. అయితే సాయంత్రానికే మంత్రి వర్గం అణగారిన వర్గాలను నయానో భయానో పార్టీలో చేరలేదని చెప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే వాహనం–ముగ్గురు నేతలు
జమ్మలమడుగు పరిధిలోని గొరిగెనూరు గ్రామానికి బుధవారమే వెళ్లాల్సి ఉండగా, పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ప్రజాస్వామ్యంలో ఒక గ్రామానికి వెళ్లేందుకు ఆటంకం కలిగించడం సమంజసం కాదని సీరియస్ అయింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అతిక్రమించకుండా వెళ్లాలని కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కేవలం ఒకే ఒక వాహనంలో మాజీ ఎంపీ, సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి మాత్రమే గ్రామంలో పర్యటించారు.
అడుగడుగునా నిఘా
గొరిగెనూరు గ్రామంలో వైఎస్సార్ సీపీ నేతలు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. 144 సెక్షన్ ఎక్కడఅతిక్రమించినా కేసులు పెట్టాలన్న ఆలోచన ఏమో తెలియదు గానీ ఒక డ్రోన్ కెమెరాతోపాటు ప్రత్యేకంగా మరికొన్ని వీడియో కెమెరాలతో వారి పర్యటనను రికార్డు చేశారు. ఎక్కడికక్కడ జమ్మలమడుగు పరిధిలోని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పరిశీలించారు. అయితే ముగ్గురు నేతలు హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తన పర్యటనలో ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా పర్యటనను ముగించుకుని వచ్చారు.