చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం

World Adivasi Day Celebrates In Vizianagaram - Sakshi

శతాబ్దాల సంస్కృతుల సమాహారం

దశాబ్దాల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

స్వచ్ఛమైన సెలయేళ్లు.. దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. పచ్చని ప్రకృతి అందాలు... వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది. వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది.

సాక్షి, విజయనగరం: దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. ఇప్పుడు అదే మంత్రి చేతుల మీదుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో జరుపుకునే అవకాశాన్నిచ్చింది.

జిల్లాలో గిరిజన ప్రాంత స్వరూపం

ట్రైబుల్‌ సబ్‌ప్లాన్‌ మండలాలు
(గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట)
8
మొత్తం గిరిజన జనాభా 5.20 లక్షలు
పురుషులు 90,948
మహిళలు 96,881
గ్రామ పంచాయతీలు 77
గ్రామాలు 289
గిరిజన ఆవాసాలు 773
జియోగ్రాఫికల్‌ ఏరియా(జిల్లా విస్తీర్ణంలో 34.4 శాతం) 2383 చదరపు కిలోమీటర్లు
గిరిజన తెగలు జటపూస్, కొండదొర, సవర, గదబ

జాతులు..భాషలు
జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలో ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ మండలాల్లో నివసించే వారి సంఖ్య 1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి, జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవర భాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలా ఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల బతుకులు ఎప్పుడో మారిపోయి ఉండేవి.

సజీవ సంప్రదాయాలకు నిలయం
గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్జుడు అనే వ్యక్తి పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వహిస్తుంటే వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.

కనీస సౌకర్యాలు కరువు
నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ, డోలీ సాయంతో మైదాన ప్రాంతా లకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. ఉండటానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. బాక్సైట్, గ్రానైట్‌ దోచుకుంటున్నారు. కొండలు పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు.

జగనన్నతోనే మార్పు మొదలు
గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కురుపాం, సాలూరు గిరిజన రిజరŠడ్వ్‌ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్‌లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ప్యానెల్‌ స్వీకర్‌ పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్‌ ప్లాన్‌ నిధులు ఖర్చుచేశారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి స్థానిక అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి.

గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండేవారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్‌ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశంతో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో, గిరిజన ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నాళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ, ఎస్టీలకు  ఉచిత విద్యుత్‌ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు.

200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగాన్ని ఉచితం చేశారు. దీనివల్ల జిల్లాలో 70వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకునే 1415 మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గత ప్రభుత్వ హయాంలో నెలకు కేవలం రూ.400 మాత్రమే భృతి ఇచ్చేవారు. కానీ గిరిజనుల ఆరోగ్యం దృష్ట్యా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆ వేతనాన్ని పదిరెట్లు పెంచి నెలకు రూ.4వేలు చేశారు. అందుకే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని తొలిసారిగా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top