ఆషాఢం.. వైవిధ్యం | Festive atmosphere in tribal villages of Alluri district | Sakshi
Sakshi News home page

ఆషాఢం.. వైవిధ్యం

Jul 3 2025 4:05 AM | Updated on Jul 3 2025 4:05 AM

Festive atmosphere in tribal villages of Alluri district

అల్లూరి జిల్లాలోని గిరిజన గూడాల్లో పండగ సందడి 

వ్యవసాయం కలిసిరావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పూజలు 

పూరీ జగన్నాథుని రథయాత్ర తరువాత నిర్వహణ 

గ్రామ పొలిమేరల్లో ఆధ్యాత్మికవాతావరణం 

పూర్వీకుల నుంచి ఆనవాయితీ 

సంస్కృతీ సంప్రదాయాలను ప్రాధ్యాన్యమిస్తున్న ఆదివాసీ గిరిజనులు

ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు.  

ముంచంగిపుట్టు: అల్లూరి జిల్లాలోని  గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు.  పూర్వీకులు చూపించిన దిశ నిర్దే­శాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెంది­న­ది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథ­యాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం  గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అరిష్టాల నుంచి గట్టెక్కి.. 
ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. 

వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు.  

గ్రామ పొలిమేరలో.. 
గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు.  మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు  చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు.  దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. 

ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు.  ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.

దోషాలు పోతాయని మా నమ్మకం 
గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది.   – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం

పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నాం 
పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు,బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement