చర్చ పొడిగిస్తే ప్రతిఘటన: కోదండరాం | will resistance, if extend Telangana Bill discussion, says Kodandaram | Sakshi
Sakshi News home page

చర్చ పొడిగిస్తే ప్రతిఘటన: కోదండరాం

Jan 17 2014 4:22 AM | Updated on Aug 18 2018 4:13 PM

చర్చ పొడిగిస్తే ప్రతిఘటన: కోదండరాం - Sakshi

చర్చ పొడిగిస్తే ప్రతిఘటన: కోదండరాం

తెలంగాణ బిల్లుపై ఈనెల 23వ తేదీలోగా అసెంబ్లీలో చర్చను ముగించాలని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు.

 సీమాంధ్రుల కుట్రలో కేంద్రం భాగస్వామి అయినట్టే
 అసెంబ్లీ ముట్టడితో విధ్వంసం: టీజేఏసీ చైర్మన్ కోదండరాం

 
తాండూరు/వికారాబాద్ న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై  ఈనెల 23వ తేదీలోగా అసెంబ్లీలో చర్చను ముగించాలని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అలా కాకుండా సీమాంధ్రనాయకుల లాబీయింగ్, కుట్రలకు లొంగి కేంద్రం మరో పదిరోజుల గడువు పొడిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ చర్చకు గడువు ఇచ్చి సరైన సమయానికి బిల్లును పంపకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా  కుట్రలో భాగస్వామి అయినట్టేనని చెప్పారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరు, వికారాబాద్‌లలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21వ తేదీన సీమాంధ్రులు పెద్ద ఎత్తుగడతోనే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారని తెలిపారు. దీనివల్ల ైెహ దరాబాద్‌లో అల్లర్లు సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అనుమతి ఇవ్వరాదని కోరారు.
 
  అంతకుముందు కోదండరాం తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్లు సరిపోతుందని, పదేళ్లు అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ సీమాంధ్రుల ఆస్తులపై గానీ, వారిైపైగానీ ఉద్యమకారులు దాడులు చేయలేదని, అలాంటప్పుడు శాంతిభద్రతల విషయం గవర్నరుకు అప్పగించడం ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డు కాదని, ఇస్తే ఇవ్వండని చెప్పిన కొన్ని పార్టీలు నేడు వాటి మనుగడ కోసమే కొత్త నాటకాలాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయాక కూడా సీమాంధ్రులు ఇంకా దానిని ఆపుతామనడం పిల్లచేష్టలని పేర్కొన్నారు.
 
 బిల్లు ప్రతులను భోగిమంటల్లో తగులబెట్టడం సరైనపద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగే పరిస్థితి వస్తుందన్నారు. దూరదృష్టి క లిగిన నాయకులు ఇలాంటి పనులు చేయకూడదన్నారు. తెలంగాణకు, సీమాంధ్రకు హైకోర్టులు వేర్వేరుగా ఉండాలన్నారు. పింఛన్లపంపిణీ,కార్పొరేషన్ల ఏర్పాటు, ఉమ్మడి పరీక్షలు, తదితర విషయాలపై అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీకి తామిచ్చిన సమగ్రమైన నివేదిక తెలంగాణ బిల్లు రూపకల్పనలో ఎంతో సహకరించిందని, అక్కడ తమదే బెస్టు రిపోర్టు అని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement