
విద్యార్థినుల మృతిపై మౌనం ఎందుకు?
కడప నారాయణ కళాశాలలో చోటు చేసుకున్న నందిని, మనీషా మృతి సంఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాలలో చోటు చేసుకున్న నందిని, మనీషా మృతి సంఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని రాయలసీమ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కర్, కో కన్వీనర్ దస్తగిరి ప్రశ్నించారు. విద్యార్థుల మరణంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని, నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎఫ్ ఆద్వర్యంలో గురువారం కోటిరెడ్డి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తక్షణమే మంత్రి నారాయణను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
సంఘటన జరిగిన పది రోజులైనా నారాయణ యాజమాన్యం కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ నారాయణ విద్యా సంస్థల సీఈఓగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు నారాయణ సంస్థల్లో జరిగిన మరణాలపై హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ జరపాలన్నారు. జియోన్ పాఠశాలలో జరిగిన హత్యలపై తక్షణమే స్పందించి ఆ సంస్థ గుర్తింపును రద్దు చేసిన విద్యాశాఖ అధికారులు నారాయణ సంస్థల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక తరగతిలో 100 మందిని కుక్కి కేవలం బట్టీ పాఠాలతో పిల్లలను హింసిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరూ ఆ సంస్థల్లో తమ పిల్లలను చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు.
నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయటంతోపాటు యాజమాన్యాన్ని క ఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం వద్ద గురువారం పీడీఎస్‌యూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి అంకన్న మాట్లాడుతూ మనీషా, నందినీల సంఘటన జరిగి పదిరోజులు గడుస్తున్నా ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమన్నారు.
ఆ కళాశాల కరస్పాండెంట్ మంత్రి కావటంతో హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించారని ఆరోపించారు. సంబంధిత విషయంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. మనీషా, నందినీల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమాలను ఆపేది లేదని స్పష్టం చేశారు.