పిల్లలు లేని జీవితం నాకెందుకు? | Sakshi
Sakshi News home page

పిల్లలు లేని జీవితం నాకెందుకు?

Published Wed, Feb 10 2016 11:23 PM

పిల్లలు లేని జీవితం నాకెందుకు?

నక్కపల్లి ఆస్పత్రి వద్ద రోదించిన తల్లి
 
నక్కపల్లి: నక్కపల్లి ఏరియా ఆస్పత్రి రోదనలతో దద్దరిల్లింది. మంగళ, బుధవారాల్లో జరిగిన సంఘటనల్లో మృతిచెందిన వారి బంధువులు, క్షతగాత్రులు, వారి బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదం అలముకుంది.  మంగళవారం పాయకరావుపేట మండలం నామవరంలో తండ్రి చేతిలో ఇద్దరు ముక్కపచ్చలారని చిన్నారులు హతమైన సంగతి తెలిసిందే. భార్యపై అనుమానంతో  పిల్లలిద్దరినీ కన్నతండ్రే  ఊపిరిరాడకుండా చేసి చంపేశాడు. ఈ చిన్నారులిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.

చిన్నారుల తల్లి నిర్మలతోపాటు  బంధువులు ఆస్పత్రివద్దకు బుధవారం చేరుకున్నారు. రక్తంపంచకు పుట్టిన బిడ్డలిద్దరూ కళ్ల ముందే విగ తజీవులుగా పడిఉండటాన్ని చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది.  పిల్లలు లేని జీవితం నాకెందుకంటూ కన్నీళ్లపర్యంతమైంది. పెద్దల మాటకాదని ప్రేమపెళ్లిచేసుకున్నందుకు భగవంతుడు నాకీ శిక్ష విధించాడంటూ రోదించింది. ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం ఆనందంగా గడుస్తుందనుకున్నానని పెళ్లయిన మరుసటిరోజునుంచే నరకం చూపించాడంటూ వాపోయింది. నావల్ల ఈ చిన్నారులిద్దరి ప్రాణాలు బలితీసుకుంటాడని తెలిస్తే బయటకు వెళ్లేదాన్ని  కాదని నాప్రాణాలే తీసుకోమని వెళ్లేదాన్నని నిర్మల రోదిస్తున్న తీరు బంధువులను కంటతడిపెట్టించింది.   బుధవారం సారిపల్లిపాలెం వద్ద ఆటో డీకొన్న  సంఘటనలో ఇద్దరు మృత్యువాతడపడగా మరో ఆరుగురు గాయపడ్డారు.  వీరి గ్రామం  ఆస్పత్రికి కూతవేటు దూరంలో  ఉండటంతో బంధువులంతా ఇక్కడికి చేరకున్నారు. అలాగే ఇదేప్రమాదంలో గాయపడ్డవారి బంధువులు కూడా రావడంతో  ఆస్పత్రి ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
 
 

Advertisement
Advertisement