breaking news
Nakkapalli Area Hospital
-
ఇదీ మంత్రి గారి వైద్య విధానం
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌పై వైద్యుడి నియామకం వైద్య విధానపరిషత్ అధికారులపై జిల్లా మంత్రి ఒత్తిడి నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలోఎండీ జనరల్ మెడిసన్ వైద్యుడు లేక రోగులకు తప్పని అవస్థలు 9 నెలలుగా నడుస్తున్న వ్యవహారం ఉద్యమించేందుకు సిద్ధపడుతున్న స్థానికులు నక్కపల్లి: నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ఏడాది క్రితం నియమితుడైన వైద్యుడు వంశీకృష్ణ (ఎండీ, జనరల్ మెడిసన్) ఇక్కడి నుంచి జిల్లాకు చెందిన ఒక మంత్రి ద్వారా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. అక్కడ అప్పటికే నళినీ ప్రసాద్ (ఎండీ, జనరల్ మెడిసన్) అనే వైద్యురాలు పనిచేస్తున్నారు. మంత్రి ఆదేశాలు కావడంతో జిల్లా అధికారులు ఈమెను నక్కపల్లి బదిలీచేసి వంశీకృష్ణను జాయిన్ చేసుకున్నారు. దీనిపై మనస్తాపం చెందిన నళినీ ప్రసాద్ కొద్దిరోజులు సెలవు పెట్టి తిరిగి కోటవురట్ల సీహెచ్‌సీకి పోస్టింగ్ వేయించుకున్నారు. అక్కడ కొద్దిరోజులకే వేరొకరిని నియమించి ఆమెను రిలీవ్ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. నక్కపల్లి ఆస్పత్రిలో మాత్రం ఎవరిని నియమించలేదు. వంశీకృష్ణ న ర్సీపట్నంలో పనిచేస్తూ జీతం నక్కపల్లిలో తీసుకుంటున్నారు. నక్కపల్లిలో రోగులకు అందని వైద్యం నిత్యం 300 నుంచి 400 ఓపీ ఉండే నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ఎండీ జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. రెగ్యులర్ ఎండీ జనరల్ మెడిసిన్ పోస్టులో ఎంబీబీఎస్ వైద్యుడిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి పనిచేయిస్తున్నారు. ఇక్కడ ఎండీ జనరల్ మెడిసిన పోస్టు ఎంతో అవసరం. ఇక్కడ నియమించిన వారిని డిప్యూటేషన్‌పై నర్సీపట్నం పంపించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్న నళినీప్రసాద్‌నైనా ఇ క్కడ నియమిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పట్టని కోఆర్డినేటర్ ఉత్తర్వులు డిప్యూటేషన్ విధానాన్ని రద్దుచేస్తూ వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ ఉత్తర్వులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పట్టించుకోలేదు. ఉన్నతాధికారి ఆదేశాలకన్నా మంత్రి ఆదేశాలకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలున్నాయి. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వంశీకృష్ణను రిలీవ్‌చేయలేకపోతున్నానంటూ ఉన్నతాధికారులకు తెలియజేయడం వెనుక మంత్రి ఒత్తిడి స్పష్టమవుతోంది. ననర్సీపట్నంలో వంశీకృష్ణను రిలీవ్‌చేసి నక్కపల్లిలో పనిచేసేలా చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని పలుప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు. మంత్రిని అడగండి దీనిపై జిల్లా కో ఆర్డినేటర్ నాయక్‌ను వివరణకోరగా ఈ విషయం మంత్రిని అడిగితే బాగుంటుందన్నారు. నేనిచ్చిన ఆదేశాలు అమలు కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. డిప్యూటేషన్ రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అక్కడ సూపరింటెండెంట్ అమలు చేయలేదని వివరించారు. మాబాధలు పైకి చెప్పుకోలేనివిగా ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో నేనేం చేయలేనని పేర్కొన్నారు. -
పిల్లలు లేని జీవితం నాకెందుకు?
నక్కపల్లి ఆస్పత్రి వద్ద రోదించిన తల్లి నక్కపల్లి: నక్కపల్లి ఏరియా ఆస్పత్రి రోదనలతో దద్దరిల్లింది. మంగళ, బుధవారాల్లో జరిగిన సంఘటనల్లో మృతిచెందిన వారి బంధువులు, క్షతగాత్రులు, వారి బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదం అలముకుంది. మంగళవారం పాయకరావుపేట మండలం నామవరంలో తండ్రి చేతిలో ఇద్దరు ముక్కపచ్చలారని చిన్నారులు హతమైన సంగతి తెలిసిందే. భార్యపై అనుమానంతో పిల్లలిద్దరినీ కన్నతండ్రే ఊపిరిరాడకుండా చేసి చంపేశాడు. ఈ చిన్నారులిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారుల తల్లి నిర్మలతోపాటు బంధువులు ఆస్పత్రివద్దకు బుధవారం చేరుకున్నారు. రక్తంపంచకు పుట్టిన బిడ్డలిద్దరూ కళ్ల ముందే విగ తజీవులుగా పడిఉండటాన్ని చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పిల్లలు లేని జీవితం నాకెందుకంటూ కన్నీళ్లపర్యంతమైంది. పెద్దల మాటకాదని ప్రేమపెళ్లిచేసుకున్నందుకు భగవంతుడు నాకీ శిక్ష విధించాడంటూ రోదించింది. ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం ఆనందంగా గడుస్తుందనుకున్నానని పెళ్లయిన మరుసటిరోజునుంచే నరకం చూపించాడంటూ వాపోయింది. నావల్ల ఈ చిన్నారులిద్దరి ప్రాణాలు బలితీసుకుంటాడని తెలిస్తే బయటకు వెళ్లేదాన్ని కాదని నాప్రాణాలే తీసుకోమని వెళ్లేదాన్నని నిర్మల రోదిస్తున్న తీరు బంధువులను కంటతడిపెట్టించింది. బుధవారం సారిపల్లిపాలెం వద్ద ఆటో డీకొన్న సంఘటనలో ఇద్దరు మృత్యువాతడపడగా మరో ఆరుగురు గాయపడ్డారు. వీరి గ్రామం ఆస్పత్రికి కూతవేటు దూరంలో ఉండటంతో బంధువులంతా ఇక్కడికి చేరకున్నారు. అలాగే ఇదేప్రమాదంలో గాయపడ్డవారి బంధువులు కూడా రావడంతో ఆస్పత్రి ఉద్విగ్న వాతావరణం నెలకొంది.