బరువు చెప్పని యంత్రాలు..!

Weighing Machine Not Working Properly In Anganwadis At Vizianagaram - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం వేయింగ్‌ మిషన్లు

ఏడాదిగా కార్యకర్తలకు తప్పని తిప్పలు

పాత వాటినే వినియోగిస్తున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీల సేవల్లో బరువు తూసే యంత్రాలే కీలకం. పిల్లలు, గర్భిణుల బరువును నెలనెలా రికార్డుల్లో నమోదు చేస్తారు. దాని ఆధారంగా పోషకాహారం అందజేస్తారు. బరువు పెరగకపోతే అదనపు పోషకాహారం ఇస్తారు. ఇది నిత్యప్రక్రియ. వీటికి బరువుతూసే యంత్రమే ఆధారం. గత టీడీపీ ప్రభుత్వం ఏడాది కిందట ఇచ్చిన వేయింగ్‌ మిషన్లు పనిచేయకపోవడంతో అంగన్‌వాడీలు అవస్థలు పడుతున్నారు. బరువు సరిగా తెలియక అయోమయానికి గురవుతున్నారు.

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు టీడీపీ ప్రభుత్వం సరఫరా చేసిన వేయింగ్‌ మిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. వీటితో అంగన్‌వాడీలు అవస్థలు పడుతున్నారు. తరచూ మరమ్మతులకు గురికావడం, బరువులో కచ్చితత్వం లేక పోవడంతో అంగన్‌వాడీలు  పాత వేయింగ్‌ మిషన్‌ (బరువుతూసే పరికరం) వాడాల్సిన పరిస్థితి.

తూకం సరిగా రాక... 
జిల్లాలోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో 2,987 అంగన్‌వాడీ, 742 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7 నెలలు నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,024 మంది, 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 41,714 మంది, గర్భిణులు 16,124 మంది, బాలింతలు 15,418 మంది ఉన్నారు. మొత్తం 1,37,280  మంది లబ్ధిదారులు ఉన్నారు.

ఏడాది కిందట వేయింగ్‌ మిషన్లు సరఫరా..
అంగన్‌వాడీ కేంద్రాలకు ఏడాది కిందట గత టీడీపీ ప్రభుత్వం వేయింగ్‌ మిషన్లు పంపిణీ చేసింది. జిల్లాలో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 2,987, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 742కు  సోలార్‌ వేయింగ్‌ మిషన్లు సరఫరా చేశారు. ఇవి సక్రమంగా పనిచేయడం లేదు. కొన్ని వేయింగ్‌ మిషన్లు ఆన్‌కావడం లేదు. కొన్ని మిషన్లు బరువులో తేడాలు చూపుతున్నాయి. దీంతో పిల్లలు, గర్భిణుల బరువును ఎలా పరిగణలోకి తీసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. కొత్త వేయింగ్‌ మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో కొన్నిచోట్ల పాత వేయింగ్‌ మిషన్లను వినియోగిస్తున్నారు. 

గర్భిణుల బరువు తూయడం కోసం...  
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణుల బరువు తూయడం కోసం వేయింగ్‌ మిషన్లను సరఫరా చేశారు. ప్రతీనెలా గర్భిణుల బరువు తూసి వాటి వివరాలు అంగన్‌వాడీలు రికార్డుల్లో నమోదు చేస్తారు. బరువులో  పెరగకపోతే వారికి అదనపు పౌష్టికాహారం ఇస్తారు.  అయితే వేయింగ్‌ మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడం అంగన్‌వాడీలు అయోమయానికి గురవుతున్నారు.

బాగుచేయించి ఇస్తున్నాం..
అంగన్‌వాడీ కేంద్రాలకు ఏడాది కిందట సోలార్‌ వేయింగ్‌ మిషన్లు సరఫరా చేశాం. మరమ్మతులకు గురైన వాటిని జిల్లా కేంద్రానికి తీసుకొస్తే బాగు చేయించి ఇస్తున్నాం. పనిచేయని మిషన్లను తమదృష్టికి తీసుకుని వస్తే బాగు చేయించి ఇస్తాం. 
  – శాంతకుమారి, ఏపీడీ, ఐసీడీఎస్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top