రాయల తెలంగాణ అంగీకరించం | we wont accept rayala telangana | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణ అంగీకరించం

Nov 27 2013 2:31 AM | Updated on Sep 2 2017 1:00 AM

రాయల తెలంగాణ డిమాండ్ వెనుక కొందరి స్వార్థప్రయోజనాలు దాగి ఉన్నాయని దీనిని తాము అంగీకరించమని సమైక్యవాదులు అంటున్నారు. ‘

 తిరుపతి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ డిమాండ్ వెనుక కొందరి స్వార్థప్రయోజనాలు దాగి ఉన్నాయని దీనిని తాము అంగీకరించమని సమైక్యవాదులు అంటున్నారు. ‘రాయల తెలంగాణ’ నాటకాన్ని ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని అనుమానిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్‌ఆర్ సీపీ ప్రాబల్యాన్ని రాయలసీమలో నిలువరించేందుకు ఈ కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 119 రోజులుగా సాగుతున్న నిరసన కార్యక్రమాలు మంగళవారం కూడా యధాతథంగా కొనసాగాయి. మదనపల్లెలో స్థానిక హోప్ హైస్కూల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
 
  రాష్ట్ర విభజన వల్ల కలిగే కష్ట, నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తాము అంగీకరించేది లేదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. తిరుపతి తుడా సర్కిల్‌లో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలో తాతయ్యగుంట ప్రాంతానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి దీక్షలో ఉన్నవారికి సంఘీభావం ప్రకటించారు.
 
  రాయల తెలంగాణ నాటకాన్ని ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్యకర్తలతో దీక్ష విరమింపచేశారు. న్యాయవాదులు కోర్టు విధుల బహిష్కరణను కొనసాగించారు. తిరుపతిలో మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టౌన్‌క్లబ్ సర్కిల్ నుంచి ప్రధాన వీధుల మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదన వె నుక కుట్ర దాగి ఉందని మబ్బు చెంగారెడ్డి ఆరోపించారు. పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఎన్టీఆర్ సర్కిల్‌లో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అలాగే ఇంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కొనసాగాయి. పలమనేరులో వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు రిలే దీక్ష కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement