
'ఒంటరిగానే పోటీ చేయమని అధిష్టానం ఆదేశం'
తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా గెజిట్ ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా గెజిట్ ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎవరితో బేరసారాల కోసం తెలంగాణ గెజిట్ రావటం లేదని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎందుకు ఇచ్చిందనేది ఇప్పుడు అనుమానం కలుగుతుందన్నారు. 9 ఏళ్ల 10 నెలలు కాలయాపన చేసి ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వటం ...రాజకీయ లబ్ధి....రాహుల్ కోసమేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీమాంధ్రకు మేలు కలిగేలా తాము పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వ్యవహరించామని కిషన్ రెడ్డి అన్నారు. సుష్మా స్వరాజ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయటం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై టీడీపీలా తాము మాట మార్చలేదని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయమని అధిష్టానం ఆదేశించిందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసి ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ అచేతనానికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు.