breaking news
President rule in Andhra pradesh
-
నేతల వాహనాలూ తనిఖీ చేస్తాం: డీజీపీ ప్రసాదరావు
* ఏపీజేఎఫ్ ‘మీట్ ది ప్రెస్’లో డీజీపీ ప్రసాదరావు * డబ్బు, మద్యం తరలింపుపై డేగ కన్ను వేశాం * ఆదాయపు పన్ను శాఖ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది * రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ ఉండడంతో పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు * మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, బలగాల తరలింపునకు హెలికాప్టర్ వినియోగిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం తరలిస్తున్నారని, దీనిపై పోలీసుశాఖ డేగకన్ను వేసిందని డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. రాజకీయనేతలు నగదు తరలింపు కోసం వినూత్న మార్గాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోందని, సమాచారం ఉంటే నాయకుల వాహనాలను కూడా తనిఖీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలో చిక్కిన డబ్బును ఓ వ్యక్తి కమీషన్ తీసుకుని రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్లు తేలిందని వివరించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ఇక ఇళ్లపై దాడుల అంశం ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ సైతం ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని... అందులో కొంత సొమ్ముకు ఆధారాలు చూపడంతో తిరిగి అప్పగించామని, మిగతా దానిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో పాటు ఎన్నికల కోడ్ సైతం అమల్లో ఉండటంతో వరుసగా వచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయడంలో పోలీసులకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదన్నారు. రెండు దశల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా అవసరమైన బందోబస్తు స్కీమ్ రూపొందిస్తున్నామన్నారు. 2009 ఎన్నికలకు పంపిన దాని కంటే కాస్త ఎక్కువగానే పారా మిలటరీ బలగాలను కేటాయిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న 1.3 లక్షల పోలీసులు, 28 వేల మంది హోంగార్డుల్లో 20 శాతం మందిని మాత్రమే సాధారణ విధులకు వినియోగిస్తూ.. మిగతా వారిని ఎన్నికల విధులకు కేటాయిస్తామన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే (ఈ నెల 30న) తెలంగాణకు సీమాంధ్ర నుంచి... రెండో విడతలో జరిగే (మే 7న) సీమాంధ్రకు తెలంగాణ నుంచి బలగాలను తరలిస్తామని తెలిపారు. మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు.. ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందనే సమాచారం నేపథ్యంలో... జిల్లా ఎస్పీల నేతృత్వంలోని స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్‌ను అప్రమత్తం చేశామని డీజీపీ చెప్పారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, తూర్పు గోదావరి, విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖల్లోని మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, బలగాల తరలింపునకు హెలికాప్టర్ వాడతామని చెప్పారు. ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి నెల జీతం అదనంగా ఇవ్వడం అనేది ఈసీ పరిధిలోని అంశమని చెప్పారు. -
పాలనపై గవర్నర్ ముద్ర
-
నేడు ఢిల్లీకి గవర్నర్
* రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టాకతొలిసారిగా హస్తినకు.. * 5, 6 తేదీల్లో ఢిల్లీలోనే బస.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీలు * 7న తిరిగి హైదరాబాద్ రాక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాక తొలిసారిగా గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 3.35 గంటలకు బయలు దేరి వెళ్లి.. బుధ, గురువారాల్లో ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. తిరిగి 7న సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు వస్తారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్తోపాటు కేంద్రంలోని పలువురు పెద్దలను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు పాలనపరంగా తాను తీసుకోదలుచుకున్న చర్యలను రాష్ట్రపతికి గవర్నర్ వివరించనున్నట్లు తెలిపాయి. అలాగే పాలనాపరంగా సహకరించేందుకు సలహాదారులుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల, పదవీ విరమణ చేసిన రాష్ట్రేతర అధికారులను నియమించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు. ఈ విషయంపైన కూడా కేంద్ర హోంశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులతో గవర్నర్ చర్చించనున్నట్లు సమాచారం. సచివాలయంలో పాలన పరమైన మార్పులు రాష్ట్ర సచివాలయంలో పరిపాలన పరమైన మార్పులకు గవర్నర్ శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ముఖ్యంగా సీఎం సహాయ నిధితో పాటు ప్రజలకు అత్యవసరమైన అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులపై ఆయన సోమవారం కసరత్తు చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం పాలన పరంగా మరిన్ని కీలక నిర్ణయాలను గవర్నర్ తీసుకోనున్నట్లు తెలిపాయి. -
పాలనపై గవర్నర్ ముద్ర
* పెట్రోల్ బంకుల బంద్ గంటల వ్యవధిలో విరమణ * నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారి జాబితా పంపాలని శాఖలకు ఆదేశాలు * పలు కీలక నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి రాజీనామాలకూ ఆదేశం! * విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల నియామకాలపైనా గవర్నర్ సమీక్ష! * సీఎంగా కిరణ్ నిర్ణయాల వివరాలు కోరిన గవర్నర్ కార్యాలయం * ఏ తేదీ నుంచి నిర్ణయాలు పంపాలో తెలియజేయాలని కోరిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ముద్ర రెండో రోజు నుంచే స్పష్టంగా కనిపించింది. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంక్‌ల బంద్‌ను గంటల వ్యవధిలో ఉపసంహరింపజేశారు. తూనికలు, కొలతల అధికారుల దాడులకు నిరసనగా పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం నుంచి మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం వాహనదారులు పెట్రోల్ లేక నానా అవస్థలు పడ్డారు. నగరంలో పౌరసరఫరాల శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీశారు. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంక్‌లు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంక్‌ల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంక్‌ల బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. నామినేటెడ్ పదవుల్లోని వారిపై దృష్టి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేట్ చేసిన పదవుల్లోని వారిపైనా గవర్నర్ దృష్టి సారించారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు సోమవారం నోట్ అందింది. దీంతో అన్ని శాఖలు తమ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను సిద్ధంచేసి పంపే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే రాజీవ్ యుువకిరణాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.సి.రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలసి రాజీనామా చేశారు. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసిరెడ్డిలతో పాటు ఇటీవల సీఎం పలు దేవాలయాలకు నియమించిన పాలక మండళ్ల చైర్మన్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారినీ రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశించనున్నట్లు సమాచారం. తుడా, వీజీడీఎంఏ చైర్మన్ , పాలకమండళ్లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించనున్నట్లు చెప్తున్నారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపై నివేదిక విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపై నివేదికను కూడా పంపాల్సిందిగా గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కోరారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రిలు తమకు కావాల్సిన వారి పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాలక మండళ్లపై నివేదికను గవర్నర్ కార్యాలయానికి సీఎస్ పంపించనున్నారు. కిరణ్ నిర్ణయాలపై సీఎస్‌ను వివరాలు కోరిన గవర్నర్ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాకు ముందు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించాలని గవర్నర్ నరసింహన్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే పాఠకులకు తెలియజేసింది. సీఎంగా కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై వివరాలను పంపాల్సిందిగా సోమవారం గవర్నర్ కార్యాలయం నుంచి సీఎస్‌కు నోట్ అందింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలో ఆ నోట్లో పేర్కొనలేదు. దీంతో.. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ తేదీ నుంచి తీసుకున్న నిర్ణయాల వివరాలను పంపాలో తెలియజేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయాన్ని సీఎస్ కోరారు. మంత్రుల పేషీల్లో సిబ్బంది 7లోగా వెళ్లిపోవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సచివాలయంలోని మంత్రుల పేషీల్లోని వ్యక్తిగత సిబ్బంది ఈ నెల 7వ తేదీలోగా ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు లేకపోవడంతో వారి వ్యక్తిగత సిబ్బంది తమ సొంత శాఖలకు వెళ్లిపోవాల్సి ఉంది. అయితే మంత్రులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను తిరిగి సాధారణ పరిపాలన శాఖకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను 7వ తేదీలోగా పూర్తి చేసి సిబ్బంది సొంత శాఖలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
* శాంతిభద్రతలపై గవర్నర్ * వాటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం * రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, నాణ్యమైన విద్య,వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ * పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించబోమని, అటువంటి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పాలన వ్యవహారాలను చేపట్టానని చెప్పారు. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం, నాణ్యమైన విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని తెలిపారు. సామాన్య ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘‘శాంతిభద్రతలు సక్రమంగా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేం. రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు మొన్నటివరకు అడిగిన ప్రశ్న రాష్ట్ర విభజన జరుగుతుందా..? లేదా..? అనిశ్చితి తొలగుతుందా..? లేదా..? అని. ఇప్పుడు ఆ నిర్ణయం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణభూమి. పెట్టుబడులకు పూర్తి అనుకూలమైనది. పెట్టుబడులు పెట్టే వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి అన్ని చర్యలు తీసుకుంటా’’ అని అన్నారు. ఎలాంటి సమస్యనైనా సామరస్యపూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రజలను కలుసుకోవడానికి జనతా దర్బార్ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. నాలుగేళ్లలో గవర్నర్‌గా బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పనిచేశానని అన్నారు. ఎవరిపట్లా పక్షపాతంతో వ్యవహరించలేదని చెప్పారు. రాష్ట్రపతి పాలన అంటే పోలీసు అధికారం కాదని, ఎంతకాలం ఉంటాను అన్నది ప్రశ్నే కాదని వ్యాఖ్యానించారు. వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలి వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, అందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని తెలిపారు. ‘‘ఒకే రకమైన రోగానికి ఒక్కో ఆస్పత్రి ఒక్కో రకంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అలా కాకుండా రాష్ట్రం మొత్తం ఒకే రకమైన చార్జీలు ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రులకు వెళ్లాలి. సామాన్య ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రుల్లో సదుపాయాలు, పరికరాలను సమకూరుస్తా. గ్రామీణ ప్రాంత వైద్యంపై ఎక్కువ దృష్టి పెడతా. రోగాన్ని నయం చేయడంకంటే.. రోగం రాకుండా చూడటానికి ప్రాధాన్యతనిస్తా’’ అని అన్నారు. ఇష్టమైన అంశం విద్య నాకు ఇష్టమైన ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టి పెడతానని గవర్నర్ చెప్పారు. ‘‘నాణ్యమైన విద్య లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు వృథాగా మారుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యనందించడానికి చర్యలు చేపడతా. విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైస్ చాన్సలర్లతో చర్చిస్తా. చాలాకాలం నుంచి విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల భర్తీ జరగలేదు. ప్రాధాన్యత క్రమంలో వాటిని భర్తీ చేస్తా. వైస్ చాన్సలర్లను నియమిస్తా’’ అని తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలి.. ‘‘రాష్ట్ర విభజన కోసం 15 సబ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇవి కేంద్ర కమిటీలతో సమన్వయం చేసుకుంటాయి. ఈ కమిటీల ప్రతిపాదనలు అపెక్స్ కమిటీకి వస్తాయి. ఆపెక్స్ కమిటీ చైర్మన్‌గా రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకుంటా. సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. ఇందులో ఇబ్బంది ఉండదు. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టం. సీఎంఆర్ఎఫ్ గురించి పరిశీలిస్తా’’ అని అన్నారు. మా తప్పులను మీడియా ఎత్తిచూపొచ్చు ‘‘గవర్నర్‌గా నాలుగేళ్లలో మొదటిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం నాది. నేను చేపట్టే కార్యక్రమాలను సజావుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీ (మీడియూ) సహకారం కావాలి. ఏవైనా పొరపాట్లు జరిగితే నిర్మాణాత్మక రీతిలో విమర్శలు చేయవచ్చు. మేము తీసుకొనే నిర్ణయాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, వాటిని నిర్భయంగా ఎత్తిచూపండి. ఎవరినైనా మీరు నిలబెట్టగలరు, కూల్చనూగలరు. మీ సహకారం కోరుతున్నా. మిత్రులుగా మెలుగుదాం. నీవు, నేను అని కాకుండా ఇకపై మనం అనేలా వ్యవహరిద్దాం’’ అని నరసింహన్ చెప్పారు. కిరణ్ నిర్ణయాలపై సమీక్షకు సమయం పడుతుంది మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్న చివరి రోజుల్లో చేసిన సంతకాలపై సమీక్షించడానికి కొద్ది సమయం పడుతుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. కిరణ్ చివరి సంతకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా’’ అంటూ పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. కిరణ్ నిర్ణయాలను గవర్నర్ సమీక్షించనున్నారంటూ ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. -
'విశాఖను రాజధాని చేయడం మంచిదే'
విశాఖపట్నం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నామని మాజీమంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజ్యంగబద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కేంద్రం నమ్మకున్న నాయకుడి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును దుయ్యబట్టారు. విశాఖను రాజధాని చేయడం మంచిదేనని, అయితే దీనిపై ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టడం సరైంది కాదన్నారు. -
రాష్ట్రపతి పాలనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. రాష్ట్రపతి పాలనపై గవర్నర్ నరసింహన్ పంపిన నివేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతృప్తి వ్యక్తం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలైంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆర్టికల్ 356 ప్రకారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో భాగంగా సీఎం, మంత్రులు పదవీ కాలాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంపై సుదీర్ఘంగా తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. అలాగే.. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా రాష్ట్రపతికి నివేదించింది. శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి ఈ రోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడంతో రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతికి అందనున్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ.. రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా కేంద్రమే నడిపించనుంది. -
కిరణ్ బండారం బయటపెడతా: ఆనం
-
కిరణ్ బండారం బయటపెడతా: ఆనం
హైదరాబాద్: రాష్ట్రపతి పాలనపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నందున కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణకు త్వరలో రెండు పీసీసీలు ఏర్పడతాయని తెలిపారు. ఎన్నికల ముందు రాజకీయ వలసలు సహజమే అన్నారు. అధికారమే పరమావధిగా భావించే అవకాశవాద నేతలు, వెన్నుపోటు దారులే పార్టీని వీడారని దుయ్యబట్టారు. కొత్త పార్టీ పెట్టాక కిరణ్ బండారాలన్నీ బయటపెడతామని ఆనం హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రానికా, రెండు రాష్ట్రాలకా అనేది రాష్ట్రపతి, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. -
'ఒంటరిగానే పోటీ చేయమని అధిష్టానం ఆదేశం'
హైదరాబాద్ : తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా గెజిట్ ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎవరితో బేరసారాల కోసం తెలంగాణ గెజిట్ రావటం లేదని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎందుకు ఇచ్చిందనేది ఇప్పుడు అనుమానం కలుగుతుందన్నారు. 9 ఏళ్ల 10 నెలలు కాలయాపన చేసి ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వటం ...రాజకీయ లబ్ధి....రాహుల్ కోసమేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు మేలు కలిగేలా తాము పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వ్యవహరించామని కిషన్ రెడ్డి అన్నారు. సుష్మా స్వరాజ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయటం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై టీడీపీలా తాము మాట మార్చలేదని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయమని అధిష్టానం ఆదేశించిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసి ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ అచేతనానికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. -
కెసిఆర్‌ను నమ్ముతున్నాం: దిగ్విజయ్
-
'రాష్ట్రపతి పాలనపై రేపు కేంద్ర కేబినెట్ నిర్ణయం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రేపు వెలువడనుంది. శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. అపాయింటెడ్ డేట్ వెలువడేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశముందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. విలీనం విషయంలో కేసీఆర్‌ను నమ్ముతున్నామని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం మంచిదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి దిగ్విజయ్, సుశీల్ కుమార్ షిండే సూచించినట్టు తెలిసింది. వీరి అభిప్రాయంతో సోనియా ఏకీభవించినట్టు తెలిసింది. కేంద్ర కేబినెట్ సమావేశం రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానుంది.