ఎడారా..కొల్లేరా!

Water Scarcity To Kolleru Lake From January - Sakshi

నీరు లేక బీటలు వారిన వైనం 

ఆహారపు కొరతతో అల్లాడుతున్న పక్షులు 

రెగ్యులేటర్‌ నిర్మాణం మాట మరిచిన సర్కార్‌

అక్రమ చేపల చెరువుల తవ్వకాలతో చేటు 

జనవరి నుంచే కొల్లేరుకు నీటి కొరత  

కైకలూరు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు ఎడారిని తలపిస్తోంది. నీటి కొరతతో మత్స్య సంపద మాయమవుతోంది. విదేశీ అతిథి పక్షులు పస్తులుంటున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో 77 వేల 138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో కలిపి 122 కొల్లేటి గ్రామాల్లో సుమారు 3.20 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. ప్రస్తుతం కొల్లేరులో నీటి జాడ లేక మైదానంలా కనిపిస్తోంది. కొల్లేరులో ఇంతటి దుర్భర పరిస్థితులు ఎన్నడూ చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దారి మళ్లిన నీటి వనరులు! 
కొల్లేరు సరస్సులోకి  67 డ్రెయిన్ల ద్వారా లక్షా 11 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమలు, కొండ ప్రాంతాల నుంచి వచ్చే రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వాగులు కొల్లేరుకు ప్రధాన నీటి వనరులు. కృష్ణా జిల్లాలో డ్రైయిన్ల ద్వారా 35వేల 590 క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతోంది. అయితే వెలగలేరు వద్ద రామిలేరు, తమ్మిలేరులను పోలవరం కుడి కాల్వకు, మరికొన్ని చిన్న కాల్వలు, డ్రైయిన్లను పట్టిసీమ ప్రాజెక్టు కాల్వలోకి మళ్ళించడంతో కొల్లేరులోకి ఏటా వచ్చే నీరు తగ్గింది. 

పక్షులకు ప్రాణసంకటం... 
పక్షి జాతులకు ఆవాసయోగ్యమైన చిత్తడి నేలలు కొల్లేరులో ఉండడంతో స్వదేశీ, విదేశాలకు చెందిన 189 రకాల పక్షి జాతులు ఇక్కడ స్థిర, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో కొన్ని జాతులు సైబీరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, నైజిరియా, శ్రీలంక వంటి దేశాల నుంచి వలసలు వస్తాయి. ఆహారం, ఆవాసం కోసం లక్షలాది మైళ్ల దూరం నుంచి వలస వస్తున్న ఈ పక్షులకు ఇక్కడ నీటి కష్టాలు తప్పడం లేదు. కొల్లేరులో నీటి కొరత పక్షుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రెగ్యులేటర్‌ నిర్మాణం అవసరం.. 
కొల్లేరులోకి చేరే నీటిని సముద్రంలోకి చేర్చే ఏకైక మార్గం ఉప్పుటేరు. ఉప్పుటేరు ద్వారా 12 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతుంది. ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మించాలని 1964లో మిత్రా కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం మూడు ప్రాంతాల్లో మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని నిపుణులు భావించారు. ఇంతవరకు
ఆ ప్రతిపాదనలు అమలు కాలేదు. రెగ్యులేటర్‌ నిర్మాణం జరగకపోవడంతో సముద్రపు నీరు ఉప్పుటేరు ద్వారా కొల్లేరులోకి ఎగదన్నుతుంది. ఈ కారణంతో భూములు చౌడుబారడంతో పాటు కొల్లేరులో జీవించే సహజసిద్ధ నల్లజాతి చేపలు మృత్యువాత పడుతున్నాయి. కొల్లేరులో నీటి కొరత కారణంగా ఉపాధి కరువై వేలాది మంది బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు. 

కొల్లేరు సమస్యల పరిష్కారం జగన్‌తోనే సాధ్యం.. 
కొల్లేరు ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. ప్రజాసంకల్ప యాత్రలో కొల్లేరు ప్రాంతానికి వచ్చిన ఆయన రెగ్యులేటర్‌ నిర్మాణానికి కమిటీ సిఫార్సులతో కార్యాచరణ చేపడతామని చెప్పారు. కొల్లేరు ప్రజల్లో ఒకరికి ఎమ్మెల్సీ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొల్లేరులోకి వచ్చే నీటి వనరులను టీడీపీ దారి మళ్లించింది.  
– ముంగర నరసింహారావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు, వడ్లకూటితిప్ప.

రెగ్యులేటర్లు నిర్మించాలి..
కొల్లేరు సరస్సులో రెగ్యులేటర్లు  నిర్మించాలి. కొల్లేరులో రెగ్యులేటర్‌ నిర్మిస్తే సముద్రపు ఉప్పునీరు పైకిరాదు.డ్రైయిన్ల ద్వారా కొల్లేరులోకి వస్తున్న కొద్దిపాటి నీటిని ఎగువ ప్రాంతాల రైతులు తరలించేస్తున్నారు. ప్రభుత్వం కొల్లేరులోకి నీటిని ఇతర మార్గాల ద్వారా పంపించాలి. వలసలను నివారించాలి.   
– ఘంటసాల వెంకటేశ్వరరావు, బీఎంఎస్‌ రాష్ట్ర మత్స్యకారుల సంఘ ఉపాధ్యక్షుడు, కొవ్వాడలంక

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top