తీరంలో తాగునీటికి కటకట

Water Problems In Mogalthuru West Godavari - Sakshi

వారం రోజులుగా వివిధ గ్రామాలకు అందని నీరు

అవస్థలు పడుతున్న 17 గ్రామాల ప్రజలు

ప్రాజెక్టుల్లో నీరున్నా గొంతుతడవని దుస్థితి

పట్టించుకోని పాలకులు, అధికారులు

మొగల్తూరు : జిల్లాకు సుదూరంగా ఉన్న మండలం మొగల్తూరు. ఈ తీరప్రాంత మండలంలోని 17 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా ఈ మండలంలోని గ్రామాల ప్రజలకు తాగునీరందడం లేదు. కాలువలో పుష్కలంగా నీరున్నా గుక్కెడు నీరందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఏ గ్రామం చూసినా తాగునీటి సమస్యే. తాగునీటి సమస్య తీర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సమస్య పరిష్కరించామని ప్రజాప్రతినిధులు చెప్పుకుంటుండగా వారికి అధికారులు వంత పాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చుట్టూ నీరున్నా తాగేందుకు ఉపయోగం లేక గుక్కెడు నీటి కోసం రోజులుగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి గ్రామంలోనూ సమస్యే
మండలంలోని కేపీ పాలెం, కాళీపట్నం, మొగల్తూరులో భారీ మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. శేరేపాలెం, కొత్తపాలెం, జగన్నాథపురం గ్రామాల్లో పంచాయతీ చెరువులున్నాయి. కేపీ పాలెం ప్రాజెక్టు ద్వారా కేపీ పాలెం నార్త్, కేపీపాలెం సౌత్, పేరుపాలెం నార్త్, పేరుపాలెం సౌత్, ముత్యాలపల్లి, మోడి, వారతిప్ప, కొత్తకాయలతిప్ప గ్రామాలకు నీరందించాల్సి ఉంది. కాళీపట్నం ప్రాజెక్టు ద్వారా కాళీపట్నం తూర్పు, పడమర, పాతపాడు, జగన్నాథపురం, కోమటితిప్ప, వారతిప్ప గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కాళీపట్నం ప్రాజెక్టులో పైపులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వారం రోజులుగా నీరందడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నా తమ దాహార్తిని తీర్చడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొగల్తూరు ప్రాజెక్టులో ఇలా..
ఇక మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు 32 శివారు ప్రాంతాలకు నీరందించాల్సి ఉంది. ప్రస్తుతానికి మొగల్తూరుకు మాత్రమే నీరందిస్తున్నారు. విద్యుత్‌ మోటార్‌ సమస్య కారణంగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది.
దీంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది.తాగునీటిని టిన్నులతో కొనుగోలు చేసుకుంటున్నారు. ముత్యాలపల్లి పంచాయతీకి సరఫరా కావల్సిన తాగునీరు గత వారం రోజులుగా అందకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని చుక్కనీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. వారానికోసారి నీరిచ్చినా గ్రామస్తులు అనేకమంది అనధికారికంగా మోటార్లు బిగించుకోవడంతో దిగువ ప్రాంతానికి నీరందడంలేదని, అనధికారకంగా బిగించుకున్న మోటార్లు తొలగించాలని కోరుతున్నారు.

అనధికారిక మోటార్లు తొలగించాలి
తమ ప్రాంతంలో అనేకమంది అనధికారిక మోటార్లు వేసుకోవడంతో దిగువ ప్రాంతానికి నీరందడంలేదు. ఈ విషయాన్ని అ«ధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లినా స్పందించడంలేదు. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుంటే తాగు నీరందించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.– మల్లాడి కొండమ్మ, కాళీపట్నం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top