రాయలసీమ రంగస్థలంపై ఇదొక జల నాటకం

This is a water play of Chandrababu At Rayalaseema - Sakshi

     గతంలోనే దాదాపు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

     మిగిలిపోయిన అరకొర పనుల అంచనా వ్యయాలు ఇష్టారాజ్యంగా పెంచుకున్న ప్రభుత్వ పెద్దలు

     కావాల్సిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టి, రూ.వందల కోట్ల కమీషన్లు కొట్టేసిన వైనం

     ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి కొత్త డ్రామాలు 

     ప్రాజెక్టులన్నీ తానే పూర్తిచేశానంటూ జనాన్ని మభ్యపెట్టే యత్నం

     గోరుకల్లు, పులికనుమ, అవుకు ప్రాజెక్టుల్లో విచ్చలవిడిగా అవినీతి 

     గోరుకల్లు రిజర్వాయర్‌ పనుల్లో రూ.400 కోట్లకుపైగా మింగేశారు  

     పులికనుమ ఎత్తిపోతల పథకంలో రూ.38 కోట్లు హాంఫట్‌ 

     అవుకు సొరంగాల పనుల్లో ఇప్పటికే ‘అదనపు’ దోపిడీ 

     సొరంగాల నిర్మాణం ఇంకా పూర్తికాకున్నా జాతికి అంకితం

సాక్షి, అమరావతి: గతంలోనే దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన అరకొర పనుల అంచనా వ్యయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి, అస్మదీయ కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టి, కోట్లాది రూపాయల కమీషన్లు కొల్లగొట్టడమే కాక, ఆయా ప్రాజెక్టులు పూర్తికావడం తన ఘనతే అంటూ జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారు. గోరకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకం, అవుకు ప్రాజెక్టు విషయంలో సీఎం ఎన్నికల ముందు నాటకాలు ఆడుతున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరో సాధించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని లబ్ధి పొందాలనుకుంటున్న చంద్రబాబు ఆరాటం నవ్వుల పాలవుతోంది. బాబు శనివారం జాతికి అంకితం చేసిన గోరుకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకం, అవుకు ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న కమీషన్ల కథ ఏమిటంటే...  

శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి కర్నూలు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మందికి తాగునీరు అందించేందుకు గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టాలని రాయలసీమ ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు 1996లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సమయంలో గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక దాన్ని పక్కనపెట్టారు. 1999 ఎన్నికల సమయంలో వామికొండ వద్ద గాలేరు–నగరికి మరోసారి శంకుస్థాపన చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టాక కూడా పనులు ప్రాంభించలేదు. తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు–నగరి పథకం కోసం కేవలం రూ.17.33 కోట్లు ఖర్చు చేశారు.

అది కూడా ఉద్యోగుల జీతభత్యాల కోసమే. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాగానే గాలేరు–నగరి తొలిదశను రూ.2,155.45 కోట్లతో, రెండోదశను రూ.2,795 కోట్ల వ్యయంతో చేపట్టి.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఐదేళ్లలో రూ.3,916.24 కోట్లు ఖర్చు చేసి, గాలేరు–నగరి తొలి దశలో 90 శాతం పనులు పూర్తి చేశారు. రెండో దశ పనులను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.2,051.33 కోట్లు ఖర్చు చేసినా తొలిదశలో మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయలేకపోయింది. ఈ క్రమంలో తొలిదశ అంచనా వ్యయాన్ని రూ.2,800.82 కోట్లకు పెంచేసింది. రెండోదశ అంచనా వ్యయాన్ని రూ.4,817 కోట్లకు పెంచేయడానికి రంగం సిద్ధం చేసింది. 

అంచనాలు పెంచి.. అస్మదీయులకు కట్టబెట్టి 
గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకూ 57.7 కి.మీ.ల గాలేరు–నగరి వరద కాలువ పనుల్లో 27వ ప్యాకేజీలో కేవలం రూ.11 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటి అంచనా వ్యయాన్ని రూ.116.69 కోట్లకు పెంచి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌ సంస్థకు పనులు అప్పగించారు. మిగిలిపోయిన పనులను తూతూమంత్రంగా పూర్తి చేసి రూ.105 కోట్లకుపైగా దోచుకున్నారు. వరద కాలువ పనుల్లో 28వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.13 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.58.50 కోట్లకు పెంచేసి, సీఎం రమేష్‌ సంస్థకు కట్టబెట్టి రూ.55 కోట్లకుపైగా కొల్లగొట్టారు. గోరుకల్లు రిజర్వాయర్‌ పనులను రూ.424 కోట్లతో 2009 నాటికే దాదాపుగా పూర్తి చేశారు. టీడీపీ పాలనలో ఆ రిజర్వాయర్‌ పనుల అంచనా వ్యయాన్ని రూ.840.34 కోట్లకు పెంచేసి, రూ.400 కోట్లకుపైగా మింగేశారు. 

‘అవుకు’లో అక్రమాల ప్రవాహం 
అవుకు రిజర్వాయర్‌ నుంచి గండికోట రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి 5.25 కి.మీ.ల పొడవున రెండు సొరంగాలు తవ్వే పనుల(30వ ప్యాకేజీ)ను రూ.401 కోట్లకు ‘ఎన్‌సీసీ–మేటాస్‌’ సంస్థ చేజిక్కించుకుంది. సొరంగం తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడటంతో అదనంగా 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర లైనింగ్‌ పనులు చేయాల్సి వచ్చిందనే సాకులు చూపి రూ.44 కోట్లు అదనంగా చెల్లించాలని 2015 అక్టోబరులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈపీసీ విధానం ప్రకారం అదనపు పనులకు అదనంగా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఓ కీలక మంత్రి కాంట్రాక్టర్లకు దన్నుగా నిలవడంతో ప్రభుత్వం రూ.44 కోట్లు అదనంగా చెల్లించింది. 

పూర్తి చేయకనే చేసినట్లు చంద్రజాలం 
అవుకు సొరంగాల తవ్వకంలో మొదటి సొరంగంలో 54 మీటర్లు.. రెండో సొరంగంలో 92 మీటర్ల మేర మట్టి పెలుసుగా ఉండటంతో పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని ప్రభుత్వానికి కాంట్రాక్టర్‌ మరో లేఖ రాశారు. 2016 డిసెంబర్‌ నాటికి గండికోట రిజర్వాయర్‌కు నీటిని తరలించాలంటే సొరంగాల స్థానంలో 504 మీటర్ల ఓ కాలువ(లూప్‌), 332 మీటర్ల మేర మరో కాలువ మొత్తం 841 మీటర్ల మేర తవ్వాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలపై సర్కార్‌ ఆమోదముద్ర వేసేసింది. ఇందుకు రూ.25.96 కోట్లు అవసరమంటూ అంచనాలు సిద్ధం చేశారు. యుద్ధప్రాతిపదికన ఆ పనులను పూర్తి చేయాలంటే పాత కాంట్రాక్టర్‌కే నామినేషన్‌ విధానంలో అప్పగించాలని ఓ కీలక మంత్రి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలపై కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించాలని నిర్ణయించారు. కాలువ తవ్వకం పూర్తయిన తర్వాత.. సొరంగం పనులను వీలును బట్టి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆ మేరకు రూ.25.96 కోట్లుతో గతేడాది ఒక లూప్‌ను పూర్తి చేశారు. గతేడాది ఐదు వేల క్యూసెక్కుల చొప్పున కొన్నాళ్లు గండికోటకు తరలించారు. ఇప్పుడు రూ.25.96 కోట్లతో మరో లూప్‌ను పూర్తి చేయకున్నా చేసినట్లు చూపారు. కానీ, ఇప్పటిదాకా సొరంగాల్లో మిగిలిన 146 మీటర్ల పనులను పూర్తి చేయలేదు. కానీ, వాటిని పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించి జాతికి అంకితం చేయడం గమనార్హం. 

దీన్నేమంటారు బాబూ? 
గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా తుంగభద్ర దిగువ కాలువ కింద 26,400 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి రూ.262 కోట్ల వ్యయంతో పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికి రూ.155 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రూ.64 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాయి. అటవీ అనుమతుల్లో జాప్యం వల్ల కేవలం రూ.43 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలిపోయాయి. 2014 ఆఖరు నాటికే అనుమతులు వచ్చాయి. మిగిలిన పనులను పూర్తి చేయడంపై గత నాలుగేళ్లపాటు ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. మిగిలిన రూ.43 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.81 కోట్లకు పెంచేసి, కాంట్రాక్టర్‌ నుంచి ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు నొక్కేశారు. అంటే ఏకంగా రూ.38 కోట్లు తినేశారన్నమాట! పులికనుమ ఎత్తిపోతలను తానే పూర్తి చేశానని నమ్మబలుకుతూ సీఎం చంద్రబాబు దాన్ని జాతికి అంకితం చేశారు. 

రాయలసీమ నోట్లో మట్టి 
శ్రీశైలం కుడి గట్టు కాలువకు(ఎస్సార్‌బీసీ)కు శ్రీశైలం జలాశయంలో 11 టీఎంసీల కేటాయింపు ఉంది. ఎస్సార్‌బీసీ ద్వారా కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టులో వరి సాగుకు నీళ్లందించాలి. ఇక తెలుగు గంగ ప్రాజెక్టు కింద కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు చెన్నై తాగునీటి అవసరాలతో కలిపి శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ ఆయకట్టుకు 74 టీఎంసీలు విడుదల చేయాలి. కర్నూలు–కడప(కేసీ) కెనాల్‌ కింద కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో మొత్తం 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ 39.90 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని సుంకేసుల, తుంగభద్ర జలాశయాలతోపాటు శ్రీశైలం నుంచి కూడా అందించాలి.

తుంగభద్ర ఎగువ కాలువ కింద అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 1,90,035 ఎకరాలు, దిగువ కాలువ కింద కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో 1,57,062 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఎగువ కాలువకు 32.50 టీఎంసీలు, దిగువ కాలువకు 24 టీఎంసీలను తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలి. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు నాలుగేళ్లుగా అడపాదడపా నీరు విడుదల చేస్తున్నప్పటికీ తొలి దశలో 1.98 లక్షల ఎకరాల్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లందించిన దాఖలాల్లేవు. మరోవైపు గాలేరు–నగరి తొలిదశ కూడా పూర్తయ్యింది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తున్నా గాలేరు–నగరి తొలి దశ కిందనున్న 1.55 లక్షల ఎకరాల్లో ఒక్క ఎకరాకైనా ప్రభుత్వం నీళ్లందించిన పాపాన పోలేదు. నీటి లభ్యత బాగా ఉండటంతో ఈ ఏడాదైనా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారని ఆశించిన రైతుల నోట్లో టీడీపీ ప్రభుత్వం మట్టి కొట్టింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు జాతికి అంకితాలు అంటూ ఎన్నికల ముందు మభ్యపెడుతున్నారని ఆడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top