గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. మండలాల వారీగా ఆ రెండు కేటగిరీలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న వివరాలను డీఆర్వో జీ గంగాధర్‌గౌడ్ గురువారం సేకరించారు. జిల్లాలోని 56 మండలాలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లతో ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. ఆ తరువాత మరోమారు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టులను రోస్టర్ల వారీగా ఆయన పరిశీలించారు. ఏ మండలంలో ఏ రోస్టర్ వద్ద పోస్టుల భర్తీ నిలిచిపోయిందన్న వివరాలను సేకరించారు. సమావేశంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జ్వాలానరసింహం, కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్లకు చెందిన సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.