విశాఖ మేయర్ మనకే దక్కాలి | Vizag mayor seat should deserve to us, says YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

విశాఖ మేయర్ మనకే దక్కాలి

Nov 22 2014 3:00 AM | Updated on Aug 17 2018 8:06 PM

త్వరలో జరుగనున్న గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను సాధించి మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

* నేతలు సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ పిలుపు
*  సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని సూచన
*  క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఇంకా దగ్గర కావాలని సలహా
*  మేయర్ పీఠం తమదేనన్న గుడివాడ అమరనాథ్


సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను సాధించి మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని ఆయన సూచించారు.
 
 హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విశాఖపట్టణం జిల్లా నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల తరువాత రానున్న ఎన్నికలు కనుక ప్రతి కార్యకర్త, నాయకుడు తమ దృష్టిని పూర్తిస్థాయిలో కేంద్రీకరించాలన్నారు. పార్టీ బలాబలాలను ఇప్పటి నుంచే అంచనా వేసుకుంటూ ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఇంచార్జిలు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఇంకా దగ్గర కావాలని చెప్పారు. 40 మందికి పైగా పాల్గొన్న ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటుగా ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను పునరావాస చర్యలపై ప్రభుత్వం తీరు, చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పిలుపునిచ్చిన డిసెంబర్ 5వ తేదీ మహాధర్నా, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలు సుదీర్ఘంగా చర్చించారు.
 
 మేయర్ పీఠం మాదే: గుడివాడ అమరనాథ్
 గ్రేటర్ విశాఖపట్టణం మేయర్ పదవిని తాము గెలుచుకోగలమని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినందువల్ల తమ పార్టీ శ్రేణులు తొలుత కొంత నిరుత్సాహానికి లోనైనా, ఇపుడు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారని చెప్పారు. మెజారిటీ స్థానాలను గెలిచి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని తాము పార్టీ అధ్యక్షుడు జగన్‌కు చెప్పామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మహాధర్నా కార్యక్రమాల్లో భాగంగా విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద జగన్ పాల్గొంటారని తెలిపారు. హుద్‌హుద్‌లో సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 విశాఖలో 38వేల కుటుంబాలు నష్టపోయాయని సాక్షాత్తూ అధికారులు నిర్ధారిస్తే కేవలం రెండువేల కుటుంబాలకు నష్టపరిహారం అందించారని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతా ల్లో 83 వేల కుటుంబాలు నష్టపోతే ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదిరోజులు విశాఖలో ఉండి ప్రచార ఆర్భాటం చేసుకున్నారనీ, వాస్తవానికి ఈనాటికీ విశాఖ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణ జరుగలేదని తెలిపారు. సమావేశంలో ముఖ్యనేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు సుజయ్‌కృష్ణ రంగారావు, గొల్ల బాబూరావు, విశాఖ పరిశీలకుడు ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు దిడ్డి ఈశ్వరి, కిడారు సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు,  మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్లా జయప్రసాద్, తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రి బలివాడ సత్యారావు సహా పలువురు పాల్గొన్నారు.
 
 పోస్టర్ విడుదల
 డిసెంబర్ 5న విశాఖలో జరుగనున్న మహాధర్నా కోసం జిల్లా నేత పోతల ప్రసాద్ రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను జగన్‌మోహన్‌రెడ్డి సమావేశానంతరం విడుదల చేశారు. విశాఖ ముఖ్య నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement