ఎక్సైజ్‌ అధికారి.. మస్కా! | Vivek beer and wines are a liquor shop | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ అధికారి.. మస్కా!

Jul 25 2017 6:17 AM | Updated on Sep 5 2018 8:43 PM

అది మద్యం దుకాణానికి ఆనుకొని ఉన్న గొదాం! తనిఖీ చేస్తే అక్కడ పరిమితికి మించిన మద్యం నిల్వ బయటపడింది! వాస్తవంగా నిబంధనల ప్రకారమైతే ఈ నేరానికి సంబంధిత వ్యాపారి లైసెన్స్‌ రద్దు చేయాలి!

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అది మద్యం దుకాణానికి ఆనుకొని ఉన్న గొదాం! తనిఖీ చేస్తే అక్కడ పరిమితికి మించిన మద్యం నిల్వ బయటపడింది! వాస్తవంగా నిబంధనల ప్రకారమైతే ఈ నేరానికి సంబంధిత వ్యాపారి లైసెన్స్‌ రద్దు చేయాలి! దుకాణాన్నీ సీజ్‌ చేయాలి! కానీ ఆ సరుకు తనది కాదని, పక్కనే ఉన్న మరో మూడు మద్యం దుకాణాలకు సంబంధించినదని ఆ వ్యాపారి వాదన! తన తప్పు నుంచి తప్పించుకోవడానికి అతను వేసిన ఎత్తుగడకు ఆ మూడు దుకాణాల లైసెన్స్‌లు రద్దయిపోయాయి! ఆ వ్యాపారికి మాత్రం ఏమీకాలేదు! ఈ వ్యవహారం ఒక్కసారిగా తారుమారైపోయిందంటే ఏదో బలీయమైన శక్తి పనిచేసి ఉండాలి! సామాన్యుడికి సైతం ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది కదా? రాజాం పట్టణంలో చోటు చేసుకున్న ఈ మస్కా వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు ఎక్సైజ్‌ శాఖలో ఓ అధికారి ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... రాజాం పట్టణం నుంచి చీపురుపల్లి రోడ్డులో వివేక్‌ బీర్‌ అండ్‌ వైన్స్‌ అనే పేరుతో మద్యం దుకాణం ఉంది. దీనికి ఈనెల 18వ తేదీనే ఎక్సైజ్‌ అధికారులు లైసెన్స్‌ మంజూరు చేశారు. సంబంధిత వ్యాపారి అదే రోజు రూ.6 లక్షల విలువైన మద్యం దుకాణానికి తెప్పించారు. అయితే ఆ దుకాణంలో అక్రమ మద్యం ఉందని, దీన్ని చుట్టుపక్కల బెల్ట్‌షాపులకు తరలించేందుకు సిద్ధం చేశారని ఈనెల 19వ తేదీన ఎక్సైజ్‌ కమిషనరేట్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అదేరోజు రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వివేక్‌ బీర్‌ అండ్‌ వైన్స్‌ దుకాణంపై దాడులు చేయడానికి సన్నద్ధమయ్యారు. కానీ స్థానిక ఎక్సైజ్‌ అధికారి ఒకరు వారిని వారించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మూసిఉన్న దుకాణంపై సంబంధిత యజమాని లేకుండా దాడి చేస్తే తిరిగి తమ పీకకే చుట్టుకుట్టుందని భయపెట్టారట! కానీ చివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆ ఎక్సైజ్‌ అధికారి సహకారం తీసుకొనే దుకాణాన్ని తెరిపించారు.

కథలో మలుపు అక్కడే....
వివేక్‌ బీర్‌ అండ్‌ వైన్స్‌ దుకాణంలో భారీ ఎత్తున మద్యం పెట్టెలు బయటపడిన సంగతి తెలిసిందే. ఒకే డోర్‌ నంబరుతో దుకాణానికి ఆనుకొని ఉన్న గోదాంలో మొత్తం 120 పెట్టెల వరకూ వెలుగు చూశాయి. ఈ సమాచారం వ్యాపారి ద్వారా తెలుసుకున్న అధికార పార్టీ నాయకుడు ఒకరు ఎక్సైజ్‌ శాఖ అధికారులపై ఒత్తితి తెచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. అందుకు అనుగుణంగా స్థానిక ఎక్సైజ్‌ అధికారి చక్రం తిప్పి 72 పెట్టెలను అక్కడి నుంచి తప్పించేశారు. అవి రాజాంలోనే ఉన్న మరో మూడు మద్యం దుకాణాలకు సంబంధించిన సరుకుగా చూపించారు. ఇదే విషయాన్ని కమిషనర్‌ డైరెక్టరేట్‌కు చేరవేశారు. ఈ మేరకు పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఆ మూడు దుకాణాలను సీజ్‌ చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ పి.శివప్రసాద్‌ వెల్లడించారు. కానీ రాజాం ఎక్సైజ్‌ అధికారి నిర్వాహకంతో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తల పట్టుకుంటున్నారు. వాస్తవానికి అక్రమ సరుకు దొరికిన మద్యం దుకాణాన్ని కూడా సీజ్‌ చేయాల్సి ఉంది. ఈ వ్యాపారిని తప్పించేందుకు ఆ ఎక్సైజ్‌ అధికారి తమను ఇరికించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు లోలోన భయపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెల్ట్‌షాపులపై దాడులంటూ ఎక్సైజ్‌ అధికారులు చేస్తున్న హంగామా వెనుకనున్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement