గగ్గోలు పెడుతున్న ఫోన్‌ వినియోగదారులు

Visakhapatnam People Suffering With Phone Calls From AP Govt - Sakshi

ప్రభుత్వ పనితీరుపై ఫోన్లు

ఒకటి నొక్కితే సరే.. రెండు నొక్కితే ఇక అంతే సంగతులు

ఫోన్లపై ఫోన్లు చేస్తున్న సిబ్బంది

ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పే వరకూ వదలని వైనం

గగ్గోలు పెడుతున్న ఫోన్‌ వినియోగదారులు

విశాఖసిటీ: అక్కయ్యపాలెంలో ఉంటున్న రమేష్‌కు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నానని, ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉందా? అంటూ అడిగారు. సంతృప్తిగా ఉంటే 1, లేకుంటే 2 నొక్కాలని అన్నారు. సదరు వ్యక్తి 2 నొక్కారంతే. ఆ రోజంతా ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ సిబ్బంది విసిగించారు. చేసేది లేక ఆయన ఆ రోజు నుంచి ఇలాంటి ఫోన్‌ కాల్‌ ఏదైనా వస్తే చాలు 1 నొక్కేస్తున్నారు.

ఎంవీపీ కాలనీలోని శ్రీనివాస్‌కు ఇదే తరహా కాల్‌ వచ్చింది. పౌర సరఫరాల శాఖ పనితీరు ఎలా ఉందని అడిగారు. అయితే.. తనకు రేషన్‌ కార్డు లేకపోవడంతో.. ఆ ఆప్షన్‌ ఫోన్‌లో లేక.. సంతృప్తిగాలేదంటూ 2 బటన్‌ ప్రెస్‌ చేశారు. అంతే.. ఇక ఫోన్‌ మీద ఫోన్‌. కార్డు లేదని చెప్పినా.. కాల్స్‌ వచ్చాయి. చేసేది లేక అంతా బాగుందని చెప్పే?శాడు’.

పై రెండు విషయాల్ని గమనిస్తే... ప్రభుత్వం పాలన కంటే ప్రచారానికే ప్రాధాన్యమిస్తోందని అర్థమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు సర్కారుకు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ప్రభుత్వం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి నాడి తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్‌ ద్వారా వస్తున్న ఫోన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఫోన్‌ కాల్స్‌ వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నామన్న అభిప్రాయం వెలుబుచ్చితే గానీ వదలడం లేదు. దీనికే జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం.. ప్రజలు తమ పాలనపై సంతృప్తిగా ఉన్నారంటూ బీరాలు పలుకుతోంది.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినప్పుడే ఆ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు. కానీ.. ఇదేమీ కనిపించకుండా.. అభివృద్ధికి బదులు అథోగతి పాలవుతున్నప్పుడు సర్కారుపై ఎవరికైనా సంతృప్తి ఎలా కలుగుతుంది.? కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధ్యమైపోతోంది. కారణం.. చంద్రబాబు ప్రభుత్వ తొండి టెక్నాలజీ. టెక్నాలజీని తానే కనిపెట్టానంటూ ప్రతి సభలోనూ చెప్పుకొస్తున్న చంద్రబాబు.. ఆ కుతంత్ర టెక్నాలజీని ప్రజలపై రుద్దుతూ విసిగిస్తున్నారు. ఆయన పాలనపై సంతృప్తిగా ఉన్నామంటూ చెప్పేదాక ఫోన్‌కాల్స్‌తో వెంటపడుతున్నారు.

ఫోన్‌ మీద ఫోన్లు
ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు సమస్య కాదు ఇది. జిల్లాలో అనేక మంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు పథకాలు అమలు చేయడం, వాటిని అర్హులకు అందేటట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం తెలుసు. ఈసారి ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ప్రజలకు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ద్వారా ఫోన్‌లు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాయిస్‌తో వస్తున్న ఫోన్‌ సంతృప్తిగా ఉన్నారా? ఉంటే 1 నొక్కాలని, లేదంటే 2 నొక్కాలని అడుగుతున్నారు. ఇలా జిల్లాలో రోజూ ప్రభుత్వ పనితీరుపై, ప్రభుత్వ పథకాలు అమలుపై వేలాది మందికి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అయితే, ఇందులో అనేక మంది 1 నొక్కుతుండడం విశేషం. పొరపాటున రెండు నొక్కితే మాత్రం ఇక అంతే సంగతులు..

2 నొక్కితే అంతే...
సర్కారు తలనొప్పి భరించలేకే అందరూ 1 బటన్‌ ప్రెస్‌ చేస్తున్నారు. ఎందుకంటే దీనివెనుక పెద్ద కథ ఉంది. పొరపాటున 2 నొక్కితే ఆ రోజుంతా పని చేయనవసరం లేదు. ఆర్‌టీజీఎస్‌ సిబ్బంది ఫోన్లమీద ఫోన్లు చేసి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? కారణం ఏమిటి? అంటూ అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. పైగా కొందరిని వారికి సంబంధం లేని అంశాలపై కూడా అభిప్రాయాలు కోరుతున్నారు. రేషన్‌ కార్డు లేనివారిని, పింఛన్లు అందుకోని వారిని, ఆ పథకాలతో సంబంధం లేని వారికి కూడా కాల్స్‌ చేసి వాటిపై అభిప్రాయం కోరుతున్నారు. తెలియకపోవడంతో కొందరు ఫోన్‌ కాల్స్‌ను చేస్తున్నారు. అయినా, మళ్లీమళ్లీ ఫోన్‌ చేసి విసిగిస్తున్నారు. దీంతో అభిప్రాయం కోరగానే 2 నొక్కితే తర్వాత పదేపదే కాల్స్‌ వస్తున్నాయి. దీంతో చేసేది లేక 1 నొక్కేస్తున్నారు. 1 నొక్కితే ఏ సమస్య ఉండదని, తర్వాత మరేమీ అడగరని, అందుకే అలా చేస్తున్నామని అనేక మంది బహిరంగంగా చెబుతున్నారు. పైగా 2 నొక్కితే తర్వాత కాల్‌ చేసి లైనులోకి వచ్చేవారు ఆధార్‌ కార్డు, ఊరు, పేరు, ఇతర ఇబ్బందికర వివరాలు అడగడంతో 1 బెటర్‌ అన్న భావనలో ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నామని పలువురు అభిప్రాయపడుతుండడం గమనార్హం. జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలుసు. అనేక మంది అధికారులు వద్ద ఈ చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. అయినా, ఎవరూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం లేదు. తీసుకెళ్లినా ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకంటూ మౌనంగా ఉంటున్నారు.

సంతృప్తిపై సర్కారు గొప్పలు
ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, పథకాలు అందకపోయినా ఇబ్బంది పడలేక 1 నొక్కితే ప్రభుత్వం అదే తమ పాలన ఘనత అంటూ ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అధికారపార్టీ నేతలు తమ ప్రభుత్వంపై 70 నుంచి 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ చెబుతుండగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు మాత్రం అచ్చెరువొందుతున్నారు. అదే సంతృప్తి అనుకుంటే ప్రతిపక్షానికి మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్థం చేసుకోపోయినా ఫర్వాలేదు గానీ, ప్రజలను విసిగించకుండా ఉంటే మంచిదని పలువురు కోరుతున్నారు.

కట్‌ చేసినా కాల్‌ వస్తోంది
షాప్‌లో బిజీగా ఉన్న సమయంలో ఫోన్‌ కాల్‌ వస్తోంది. కట్‌ చేస్తున్నా మళ్లీ మళ్లీ కాల్‌ వస్తోంది. ఏదో ఇంపార్టెంట్‌ అని చూస్తే.. ఆర్‌టీజీఎస్‌ కాల్‌. మా ఇంట్లో ఫోన్‌కి పొరపాటున 2 నొక్కాను. అంతే.. ఆ రోజు దాదాపు 8 నుంచి 10 కాల్స్‌ వరకూ వచ్చాయి. అందుకే.. ముందు జాగ్రత్తగా ఒకటి బటన్‌ ప్రెస్‌ చేసేశాను.            – వేణుగోపాల్, వ్యాపారి, లలితానగర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top