పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: వినయ్‌ చంద్‌

Visakhapatnam Collector Vinay Chand Press Meet About Sachivalayam Exams - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణకు రెండు రోజుల అంతరాయం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1-8 వరకు సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 2వ తేదీన వినాయక చవితి, 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉండటంతో ఆ రెండు రోజులు పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. మిగతా ఆరు రోజుల్లో.. రోజుకు రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,35,614 మంది పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఇందుకోసం 406 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు.. మధ్యాహ్నం 2:30గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్‌లో పరీక్షా పేపర్లు భద్రపరుస్తున్నామని వినయ్‌ చంద్‌ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక గెజిటెడ్ అధికారిని నియమించామని.. పరీక్ష పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు కొరకు  మరో 50 నిమిషాలు అదనంగా సమయాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు. కంట్రోల్ రూముల్లో టోల్‌ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశాఖ కలెక్టరేట్‌కు సంబంధించి 0891-2590100, 0891-2590102, 180042500002, విశాఖ జీవీఎంసీకి సంబంధించి 0891-2869131,180042500009 నెంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే రోజు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. విశాఖ సిటీతో పాటు రూరల్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష రాసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు వినయ్‌ చంద్‌.
(చదవండి: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top