ల్లా పరిషత్‌లో ఏం జరుగుతోంది? చైర్‌పర్సన్ ఎవరు? అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్న వారెవ్వరు? వేదికపై ప్రైవేటు వ్యక్తికి అధికారులు ఎందుకు స్థానం కల్పిస్తున్నారు?......
జిల్లా పరిషత్‌లో ఏం జరుగుతోంది? చైర్‌పర్సన్ ఎవరు? అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్న వారెవ్వరు? వేదికపై ప్రైవేటు వ్యక్తికి అధికారులు ఎందుకు స్థానం కల్పిస్తున్నారు? పాలనలో సదరు వ్యక్తి తలదూర్చి దిశానిర్దేశం చేస్తుంటే బసవన్నల్లా ఎందుకు తలలాడిస్తున్నారు? ఇలా అనేక ప్రశ్నలు జెడ్పీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవాని ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. ఆమె భర్త లాలం భాస్కరరావు పెత్తనమే సాగుతోంది. సమావేశాల్లో అతని జోక్యం పెచ్చుమీరుతోంది. చైర్‌పర్సన్ డమ్మీ అన్నట్టు అధికారులు సైతం ఆమె భర్త కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. మంగళవారం జెడ్పీలో సమావేశం తీరు దీనికి అద్దం పట్టింది.
విశాఖ రూరల్: టీడీపీ నాయకుడు లాలం భాస్కరరావు జిల్లా పరిషత్‌లో అంతా తానై నడిపిస్తున్నారు. చైర్‌పర్సన్ భర్త అన్న ముద్రతో అధికారులతో వేదిక పంచుకుంటున్నారు. కొత్త పాలకవర్గం ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు మూడుసార్లు అధికారులతో సమావేశా లు నిర్వహించారు. అన్నింటిలోను చైర్‌పర్సన్ భవాని పక్కనే వేదికపై కూర్చున్నారు. అంతటితో ఆగకుండా అధికారులకు, సిబ్బందికి అన్ని విషయాల్లోను ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవా రం కూడా అదే సీన్ కనిపించింది. జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహిం చారు.
ఇందులో వేదికపై చైర్‌పర్సన్ భవాని పక్కనే ఆమె భర్త భాస్కరరావు కూర్చున్నారు. ఒకవైపు చివరన జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, మరోవైపు చివరన డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ ఉన్నారు. సమావేశం లో అధిక సమయం భాస్కరరావే ప్రసంగించారు. ‘సంక్షే మ పథకాలు ప్రజలందరికీ చేరాలి. పించన్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలి’ అంటూ ఎంపీడీవోలను ఆదేశించారు. నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా విని యోగించుకుంటే జిల్లా అభివృద్ధి చెందుతుందని, సహకరించాలని సూచించా రు. అధికారులు కూడా ఆయన మాట లకు చక్కగా తలూపారు. చైర్‌పర్సన్ మాత్రం ప్రతీ సమావేశంలోను ఒకే డైలాగ్‌ను వల్లెవేస్తున్నారు. ఈ సమావేశంలో కూడా తనను తాను చైర్‌పర్సన్‌గా పరిచయం చేసుకొని, ‘నేను అన్నింటిపై అవగాహన పెంచుకుంటున్నాను, సహకరించండి’ అని మూడు ముక్క లు మాట్లాడి కూర్చుండిపోయారు.
రహస్యంగా సమావేశాలెందుకో
సాధారణంగా ఏ చిన్న సమావేశం నిర్వహించినా.. అందులో నిర్ణయాలు మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పరితపిస్తుంటారు. కానీ విచిత్రంగా జెడ్పీ చైర్‌పర్సన్‌గా భవాని ఎన్నికయ్యాక నిర్వహిస్తున్న సమావేశాల విశేషాలను బయటకు పొక్కనీయడం లేదు. అసలు సమావేశం విషయాన్నే చెప్పడం లేదు. చైర్‌పర్సన్ భర్తగా అధికార దర్పాన్ని చెలాయించడం కోసమే అధికారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి జెడ్పీ చైర్‌పర్సన్ భర్త అయినప్పటికీ పరిషత్ పాలన, నిర్ణయాల్లో వేలు కూడా పెట్టకూడదు. కానీ భాస్కరరావు మాత్రం ఏ హోదోతో సమావేశాలు నిర్వహిస్తూ వేదికపై నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అధికారులు సైతం ఆయన అడుగులకు మడుగులొత్తుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.